ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేదికగా దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబరు 24న తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ యాక్షన్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. వరల్డ్‌కప్ వేదికగా తమ సత్తా చాటాలని ఇరు దేశాల క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాక్ జట్టు టీమ్ఇండియాను ఓడిస్తే.. పాక్ క్రికెట్ బోర్డుకు బ్లాంక్ చెక్ వస్తుందని అన్నాడు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
"పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి 50 శాతం నిధులు వస్తున్నాయి. అయితే, ఐసీసీకి సుమారు 90 శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్థాన్ క్రికెట్‌ను నడిపిస్తున్నాయని వివరించారు. ఐసీసీకి, బీసీసీఐ నుంచి నిధులు సమకూరకుంటే పాక్ క్రికెట్ బోర్డు కుప్పకూలుతుంది. పాక్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐలా ఆర్థికంగా బలంగా ఉంటే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇంతటి సాహసం చేసి ఉండేవి కాదు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌తో పాటు న్యూజిలాండ్‌ను ఓడించాలని కోరుకుంటున్నా".
- రమీజ్ రాజా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్
భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా 5 సార్లు టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కొత్త జెర్సీ