కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు బార్బడోస్ ట్రిడెంట్ తన పేరును మార్చుకోనుంది. జట్టులో మెజారిటీ భాగాన్ని ఐపీఎల్‌కు చెందిన రాజస్థాన్ రాయల్స్ యజమానులు కొనుగోలు చేసిన క్రమంలో జట్టు పేరు బార్బడోస్ రాయల్స్‌గా మారనుంది. ఫలితంగా సీపీఎల్‌లో ఓ జట్టును సొంతం చేసుకున్న మూడో ఐపీఎల్ ఫ్రాంచైజ్‌గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
రాయల్స్ ఫ్రాంచైజ్‌లో 65శాతం వాటాను సంపాదించుకున్న ఈఎమ్ స్పోర్టింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ యజమాని మనోజ్ బదాలే ఈ విషయంపై స్పందించారు.
"రాజస్థాన్ రాయల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచాలని ఎన్నో ఏళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అవకాశం దక్కింది. ఏడాది మొత్తాన్ని పరిగణిస్తే.. అందులో ఐపీఎల్ కేవలం ఓ చిన్న భాగం. అభిమానులు.. తమకు ఇష్టమైన రాయల్స్ టీమ్‌కు మద్దతు పలికేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్రికెట్ పరంగా కొత్త విషయాలపై ప్రయోగాలు చేసినట్టు ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాం."
-మనోజ్ బదాలే, ఈఎమ్ స్పోర్టింగ్ హౌల్డింగ్ యజమాని.
2015లో కోల్‌కత్ నైట్ రైడర్స్ యజమానులు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్.. సీపీఎల్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్‌ను సొంతం చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్.. సెంట్ లుసియా జౌక్స్‌ను గతేడాది కొనుగోలు చేసింది.
సీపీఎల్ 2021 సీజన్.. ఆగస్టు 26న ప్రారంభం కానుంది. రాయల్స్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర.. సీపీఎల్‌లో తమ కొత్త టీమ్ వ్యవహారాలను కూడా చూసుకోనున్నారు.
ఇదీ చూడండి:- సీపీఎల్: ఇదేమి సెలబ్రేషన్‌రా నాయనా..!