Suryakumar Unique Shots Secret : ఆసియా కప్‌లో భారత్ సూపర్-4 దశకు చేరుకొంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించింది. ఇక బుధవారం హాంకాంగ్‌పై విజయం నమోదు చేసి తదుపరి దశకు దూసుకెళ్లింది. పాక్‌తో పెద్దగా రాణించని సూర్యకుమార్‌యాదవ్ హాంకాంగ్‌పై చెలరేగాడు. ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ (59*)తో కలిసి మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టడం విశేషం. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఇలా చెలరేగడం వెనుక ఉన్న సీక్రెట్‌ను సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. "ఇలాంటి షాట్లను ఇంతకుముందు ప్రాక్టీస్ ఏమీ చేయలేదు. అయితే, చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సిమెంట్ రోడ్ మీద రబ్బర్ బంతులతో క్రికెట్ ఆడటం వల్లే ఇలాంటి షాట్లు సాధ్యవుతాయని నా అభిప్రాయం. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్ జరిగిన పిచ్ గురించి రోహిత్, రిషభ్ పంత్‌తో మాట్లాడా. నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే కాస్త దూకుడుగా ఆడాలని నిర్ణయించుకొన్నా. కనీసం 170-175 పరుగులు చేయాలనేదే మా లక్ష్యం. ఈ వికెట్‌పై అలా చాలా మంచి స్కోరు. అయితే, చివరికి 192 పరుగులు చేయడం ఆనందంగా ఉంది" అని సూర్యకుమార్ వివరించాడు. 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగింది. సూపర్-4లో భారత్ ఆదివారం మ్యాచ్ ఆడనుంది. అయితే, గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్-హాంకాంగ్ మ్యాచ్ విజేతతో టీమ్‌ఇండియా తలపడనుంది.