సొంతగడ్డపై టీమ్‌ఇండియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడడం అనుమానంగా మారింది. శుక్రవారం అతని కుడి మోచేతికి శస్త్రచికిత్స జరగబోతుండడమే అందుకు కారణం. ఇప్పటికే న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు అతను దూరమయ్యాడు. తన కుడి చేతికి ఇది రెండో శస్త్రచికిత్స.
"ఆర్చర్ కుడి మోచేతి గాయాన్ని వైద్య సిబ్బంది పరీక్షించారు. అతనికి శస్త్రచికిత్స జరగనుంది. మరింత సమాచారం త్వరలో తెలియజేస్తాం" అని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. అయితే అతను కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో మాత్రం వెల్లడించలేదు. కానీ అతను కనీసం భారత్‌తో రెండు టెస్టులకైనా దూరమయ్యే అవకాశముంది.
26 ఏళ్ల ఆర్చర్ ఇటీవల కౌంటీల్లో ససెక్స్ తరపున ఆడిన తర్వాత మోచేతి నొప్పి రావడం వల్ల వైద్యులను సంప్రదించాడు. దీంతో వాళ్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే ఈ ఏడాది మార్చిలో గాయంతోనే భారత పర్యటనకు వచ్చిన అతను.. మోచేతి కీలుకు ఇంజక్షన్లు తీసుకున్నాడు. కానీ నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను.. వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రేక్షకులకు అనుమతి