BCCI Constitution Amendment : బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జయ్ షా పదవీకాలం పొడిగించేందుకు సుప్రీంకోర్టులో అనుమతి లభించింది. ఈ మేరకు 'కూలింగ్ ఆఫ్ పీరియడ్'ను తొలగిస్తూ బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. ఈ సవరణ రాజ్యాంగ అసలు లక్ష్యాన్ని వక్రీకరించదని భావిస్తున్నామని.. అందుకే ఆమోదిస్తున్నట్లు పేర్కొంది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. స్టేట్ అసోషియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు చొప్పున కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేకుండా మొత్తం 12 సంవత్సరాలు ఆఫీస్ బేరర్‌గా ఉండొచ్చని చెప్పింది. అయితే కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేకపోవడం.. గుత్తాధిపత్యాన్ని పెంపొందించడానికి కాదని పేర్కొంది.
జస్టిస్ ఆర్‌ఎం లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో ఏ పదవిలోనైనా వరుసగా ఆరేళ్లకు మించి కొనసాగకూడదు. మూడేళ్ల కూలింగ్ పీరియడ్ తర్వాతే మళ్లీ ఏ పదవైనా చేపట్టాల్సి ఉంటుంది. కానీ 3 ఏళ్ల విరామాన్ని తొలగించాలని నిర్ణయిస్తూ 2019 సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ సవరణ చేసింది. దీంతో గంగూలీ, జై షా తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ బాధ్యతలు చేపట్టగా.. అతడి పదవి కాలం 2020 జులైలోనే ముగిసింది. కార్యదర్శిగా జై షా పదవి కాలం కూడా అదే ఏడాది పూర్తయింది. బీసీసీఐలో పదవులు చేపట్టక ముందు నుంచే బెంగాల్ క్రికెట్ సంఘంలో గంగూలీ, గుజరాత్ క్రికెట్ సంఘంలో జై షా ఆఫీస్ బేరర్లుగా చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి: 4 ఓవర్లలో 2 మెయిడెన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలే
పాక్‌తో మ్యాచ్.. మిస్క్యాచ్ వల్ల రాత్రంతా అర్షదీప్ అలా చేశాడా?