Gavaskar about Thomson: ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సునీల్ గావస్కర్ తన క్రికెట్ కెరీర్లో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బయట పెట్టారు. తన క్రికెట్ కెరీర్లో మైకేల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్, డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్ వంటి హేమాహేమీ బౌలర్లను గావస్కర్ సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే, తాను ఎదుర్కొన్న అత్యంత వేగవంతమైన బౌలర్ మాత్రం జెఫ్ థాంప్సనే అని చెప్పుకొచ్చారు. అప్పట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకున్న సరదా సన్నివేశాన్ని గావస్కర్ పంచుకున్నారు.
"అప్పట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగడం వల్ల 140 పరుగులకే ఆసీస్ జట్టు కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. టీమ్‌ఇండియా ఓపెనర్ చేతన్ చౌహాన్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే జెఫ్ థాంప్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతడి బౌలింగ్‌లో చేతన్ ఓ ఫోర్ బాదాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న భారత ఆటగాళ్లంతా లేచి 'మాస్టర్.. మాస్టర్' అంటూ కేకలు వేశారు. ఆ మాటలు విన్న మేం సరదాగా నవ్వుకున్నాం."
"అయితే, తనని చూసి నవ్వుకుంటున్నామేమోనని.. థాంప్సన్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. దీంతో ఆవేశంగా చేతన్ దగ్గరికి వెళ్లి.. అతడి హెల్మెట్‌పై ఓ క్రాస్ మార్క్ పెట్టాడు. 'నేను ఇక్కడ కొడతాను. అప్పుడు ఎలా నవ్వుతావో నేనూ చూస్తాను' అని థాంప్సన్ అన్నాడు. చేతన్ కూడా అంతే ఆవేశంతో 'ఏం చేసుకుంటావో చేసుకో' అని బదులిచ్చాడు. వారిద్దరి మధ్య చెలరేగిన వాగ్వాదాన్ని చల్లార్చేందుకు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న నేను కలుగజేసుకుని చేతన్‌కి సర్దిచెప్పాను. ఆ విషయాన్ని వదిలేయమని చెప్పాను. 'నేను రాజ్‌పుత్‌ని.. వెనకడుగు వేసేదేలే' అని చేతన్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత థాంప్సన్ మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. మెరుపు వేగంతో బంతులేశాడు. నా క్రికెట్ కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత వేగవంతమైన బౌలర్ అతడే" అని సునీల్ గావస్కర్ చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్లో 125 టెస్టులు ఆడిన సునీల్ గావస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు, 108 వన్డేల్లో 35.13 సగటుతో 3,092 పరుగులు చేశారు.