శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న రోహిత్ సేన.. ఆదివారం జరిగే చివరి వన్డేకు సిద్ధమైంది. నామమాత్రపు మ్యాచ్ అయినందున.. రిజర్వ్ బెంచ్ బౌలర్లకు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. లంకతో సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసి.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను మరింత ఆత్మవిశ్వాసంతో ఆడాలని రోహిత్ సేన భావిస్తోంది. శ్రీలంకతో ఆఖరి వన్డేకు వేదికైన తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ మైదానంలోనూ బ్యాటర్లు సత్తా చాటాలని టీమిండియా ఆశిస్తోంది. ఇక ఈ స్టేడియం బౌలింగ్‌కు అనుకూలించడం సానుకూలాంశం.
పేసర్ షమీకి విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ వ్యూహాలు రచిస్తోంది. చాహల్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్.. రెండో వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవటంతో ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అక్షర్ స్థానంలో కివీస్ సిరీస్‌కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశాలున్నాయి. అటు.. టీ-20తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన పర్యాటక శ్రీలంక జట్టు.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది.
ఇక జనవరి 18, 21, 24 తేదీల్లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది భారత్. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం.. తొలి మ్యాచ్ కోసం ముస్తాబవుతోంది. తర్వాతి రెండు వన్డేలు రాయ్‌పుర్, ఇందోర్ నగరాల్లో జరగనున్నాయి.