India vs South Africa Tour 2021: త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత జట్టు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్నా.. ఇండియా-ఎ జట్టును బీసీసీఐ వెనక్కి పిలవకపోవడం సాహసోపేత నిర్ణయమని ప్రశంసించింది. ఇండియా-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో అనధికారిక టెస్టు జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే.. భారత సీనియర్ ఆటగాళ్ల బృందం డిసెంబరు 9న దక్షిణాఫ్రికా బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. అలాగే దక్షిణాఫ్రికా ఏర్పాటు చేసే బయోబబుల్‌పై నమ్మకముందని వెల్లడించారు.
"టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఆరోగ్యం పట్ల దక్షిణాఫ్రికా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుత పర్యటనలో ఉన్న జూనియర్ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లను కూడా బయో బబుల్‌లో ఉంచి మెరుగైన రక్షణ కల్పిస్తాం. చాలా దేశాలు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్న నేపథ్యంలో ఇండియా-ఎ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండటం చాలా గొప్ప విషయం. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న బీసీసీఐకి ధన్యవాదాలు" అని దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ పేర్కొంది.
"భారత్-దక్షిణాఫ్రికా పర్యటన ఇప్పటివరకైతే యాథాతథంగా జరుగుతుంది. అలాగే ఆటగాళ్ల భద్రత విషయమై మేము రాజీపడం. న్యూజిలాండ్‌తో ముంబయి టెస్టు ముగిశాక జోహన్నెస్‌బర్గ్ వెళ్లేందుకు ఆటగాళ్ల కోసం ఛార్టెజ్ ఫ్లైట్ సిద్ధం చేశాం. వేదికలు మార్చే విషయమై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. సిరీస్‌ను నిర్వహించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తాం" అని వివరణ ఇచ్చారు ధుమాల్. టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి ముంబయి వేదికగా ప్రారంభం కానుంది.