Sourav Ganguly On Teachers Day : గ్రెగ్ చాపెల్ - సౌరభ్ గంగూలీ వివాదం.. టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఓ కుదుపు కుదిపిన ఆ సంఘటనను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. 2005-2007 సమయంలో అప్పటి ప్రధాన కోచ్ గ్రెగ్ చాపెల్ కారణంగా గంగూలీ జట్టులో నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డెబో మిత్రా, జాన్ రైట్, గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు గ్రెగ్ చాపెల్‌కు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ శుభాకాంక్షలు చెప్పడం వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్‌లో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో గంగూలీ మాట్లాడుతూ.. "2003 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాకు కొత్త కోచ్ దొరికాడు. కొన్ని పేర్లు చర్చకు వచ్చినా ఆఖరికి ఆసీస్‌కు చెందిన గ్రెగ్ చాపెల్ వైపు మొగ్గు చూపాం. 2007 ప్రపంచకప్ మాకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే 2003 వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్నాం. ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడాం. అందుకే మా జట్టంతా మరొక అవకాశం కోసం ఎదురు చూశాం. ఈ క్రమంలో కెప్టెన్సీని నేను ఇచ్చేశా. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి కప్‌ను అందించాలనేదే నా లక్ష్యం. చివరికి జట్టులో నా స్థానం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే ఎప్పుడూ తలొగ్గాలని భావించలేదు. కానీ నా కలను నెరవేర్చుకోలేకపోయా. మళ్లీ 2007లో పాక్‌తో సిరీస్‌కు ఎంపికయ్యా. భారీగా పరుగులు చేశా. అది నాకు మంచి సిరీస్. ఉత్తమ, దృఢమైన ఆటగాడిగా తిరిగి వచ్చా. నేను నిష్క్రమించను. వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని భావించా" అని ఓ క్రీడా ఛానెల్‌తో గంగూలీ వివరించాడు. 2007 క్యాలెండర్ ఇయర్‌లో 10 మ్యాచుల్లో 1,106 పరుగులను గంగూలీ చేశాడు. ఆఖరికి 2008లో క్రికెట్ నుంచి గంగూలీ వీడ్కోలు పలికాడు.
ఇవీ చదవండి: రోహిత్ భయ్యా దూకుడు లోపించిందా..?
అర్ష్‌దీప్ క్యాచ్ మిస్.. రోహిత్ సీరియస్.. వీడియో వైరల్