Mohammed Siraj ODI : బార్బడోస్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ దూరం కానున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించిన నేపథ్యంలో అతడు ఇండియాకు తిరిగి వచ్చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లతో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్. వర్క్‌లోడ్ కారణంగా విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి సిరాజ్‌ను బీసీసీఐ తప్పించింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లు ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో సిరాజ్‌కు కాస్త విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
India Vs West Indies ODI : అశ్విన్, భరత్, అజింక్య రహానే, నవదీప్ సైనీ.. ఈ నలుగురిని టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. దీంతో వాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే విండీస్ నుంచి తిరిగొచ్చిన టెస్ట్ సభ్యులతో కలిసి సిరాజ్ కూడా ఇండియా వచ్చేశాడు. అయితే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ లేకపోవడం వల్ల.. వన్డే సిరీసులో కూడా భారత పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో సిరాజ్‌కు విశ్రాంతి దొరకదని భావించిన బీసీసీఐ.. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని.. విండీస్ వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చింది. ఇక ఫ్యాన్స్ సైతం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
IND VS WI ODI : మరోవైపు జట్టులో కీలక ప్లేయరైన హార్దిక్ పాండ్యా పేసర్ల దళాన్ని నడిపించే అవకాశం ఉంది. ఇక అతనితో పాటు ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.. టీమ్‌లో ఉన్నారు. వీరిలో ఉనద్కత్ ఒక్కడే సీనియర్ బౌలర్ కావడం గమనార్హం. కాగా విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఇక తొలి వన్డేకు అతడి స్ధానంలో ముకేశ్ కుమార్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.