క్రీజు బయటకొచ్చి ఆడితే భయంకర బౌన్సర్లతో దాడి చేస్తానని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. 2007లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీసులో ఏం జరిగిందో వివరించాడు. నాలుగో వన్డే ముందురోజు డిన్నర్ చేస్తుండగా అతడు తనను కలిశాడని గుర్తు చేసుకున్నాడు.
"మేమంతా కలిసే డిన్నర్ చేశాం. షోయబ్ భాయ్ నా వద్దకొచ్చాడు. గువాహటి వన్డేలో బాగా ఆడానని ప్రశంసించాడు. నేను క్రీజు దాటి అతడి బౌలింగ్‌ను ఆడానని చెప్పాడు. అయితే మరోసారి అలా ఆడితే బాగుండదన్నాడు. బహుశా నీ తలకు గురిపెడుతూ ఓ భయానక బౌన్సర్ రావొచ్చని బెదిరించాడు. ఆ తర్వాత నేనలా ఆడేందుకు భయపడ్డాను" అని ఉతప్ప గుర్తుచేసుకున్నాడు.
"గువాహటిలో త్వరగా చీకటి పడుతుంది. 34 ఓవర్ల తర్వాత అప్పట్లో పాత బంతితోనే ఆడేవాళ్లం. ఇర్ఫాన్ పఠాన్, నేను క్రీజులో ఉన్నాం. మా విజయానికి 25 బంతుల్లో 12 పరుగులే అవసరం. అక్తర్ నాకు యార్కర్ విసరడం గుర్తుంది. భయంకరంగా వచ్చిన ఆ బంతిని నేను ఆపాను. అది కనీసం 154కి.మీ వేగంతో వచ్చింది. ఆ తర్వాత బంతి పుల్‌టాస్. దాన్ని బౌండరీకి పంపించా. ఆ తర్వాత మాకో 3-4 పరుగులు కావాలి. షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో క్రీజుదాటి కొట్టే అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నా. అతడు లెంగ్త్ బంతి విసిరాడు. నా బ్యాటు అంచుకు తగిలి బౌండరీకి వెళ్లడం వల్ల మేం గెలిచాం" అని ఉతప్ప గుర్తు చేసుకున్నాడు.