Shane Warne Memorial Service: స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌ను తలుచుకుంటూ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. సహచర ఆటగాళ్లు బాధలో మునిగిపోయారు.. కుటుంబ సభ్యులు అశ్రు నివాళులర్పించారు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో నిర్వహించిన వార్న్ స్మారక సభలో కనిపించిన దృశ్యాలివి. వార్న్ లేడంటే నమ్మశక్యంగా లేదంటూ సభకు హాజరైన వేలాది మంది అభిమానులు మౌనంగా రోదించారు. "వార్నీ" అంటూ కేకలు పెట్టారు. ఆసీస్ ప్రధాని మోరిసన్ సహా రాజకీయ, సంగీత, సినిమా, వ్యాపార, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు.
ప్రముఖ గాయకుడు ఎల్టాన్ జాన్.. "డోంట్ లెట్ ది సన్ గో డౌన్ ఆన్ మి" అనే పాటను వార్న్ పిల్లలకు అంకితమిచ్చాడు. "నేను పొగ తాగా. మద్యం సేవించా. కాస్త క్రికెట్ ఆడా" అని తనకు తాను వార్న్ చెప్పుకునేవాడని అతని తండ్రి కీత్ పేర్కొన్నాడు. "వార్న్.. నువ్వు లేని జీవితాన్ని నేను, మీ అమ్మ ఊహించుకోలేకపోతున్నాం. చాలా త్వరగా వెళ్లిపోయి మా హృదయాలను ముక్కలు చేశావు" అని అతడు తెలిపాడు. "నాన్న నువ్వు స్వర్గానికి వెళ్లి 26 రోజులైంది. మేము నిన్నెంతో మిస్ అవుతున్నాం. మళ్లీ నీ గొంతు వినడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటావని మాకు తెలుసు" అని వార్న్ తనయుడు జాక్సన్, కుమార్తెలు బ్రూక్, సమ్మర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇదీ చదవండి: 'మంచి స్పిన్నర్లు ఎందరో ఉంటారు.. వార్న్ మాత్రం భిన్నం'