Shami Backs Virat Kohli: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రధాన పేసర్ మహ్మద్ షమి మద్దతుగా నిలిచాడు. అతడు సెంచరీ కొట్టకపోతే ఏమైందని.. అతడెంత పెద్ద ఆటగాడనేది ఒక శతకం నిర్వచించలేదని అన్నాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ శతకాలు సాధించకపోయినా అర్ధశతకాలు సాధిస్తున్నాడని గుర్తుచేశాడు. అలాంటప్పుడు అతడి బ్యాటింగ్ గురించి ఆలోచించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు. అతడు సాధించే 50-60 పరుగులు కూడా జట్టుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షమి.. విరాట్ బ్యాటింగ్‌పై వస్తోన్న విమర్శలను కొట్టిపారేశాడు.
'కోహ్లీకున్న మంచి లక్షణం ఎనర్జీనే. దాంతో జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడు. అతడెప్పుడూ బౌలర్ల సారథి. మేం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఎప్పుడూ మాతో చర్చించి మా అభిప్రాయాలకు విలువనిస్తాడు. అతడితో మేమెంతో కాలం కలిసి ఉన్నాం. దాంతో మామధ్య మంచి జ్ఞాపకాలు మిగిలిపోయాయి. అవెప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. అందులో ఏది ప్రత్యేకమని అడిగితే చెప్పలేను' అని షమి చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలయ్యాక పలువురు నెటిజన్లు షమీని విమర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ ఈ పేసర్‌కు అండగా నిలిచాడు. ఇప్పుడు షమి అతడికి మద్దతు తెలపడం గమనార్హం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: చెన్నైలో ధోనీ.. ఐపీఎల్ మెగా వేలం కోసం పక్కా స్కెచ్!