వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్‌తో పోల్చడం సంతోషంగా అనిపించిందని తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్ అన్నాడు. కానీ తన కెరీర్ ఇప్పుడే ఆరంభమైందని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడటం అద్భుతమని తెలిపాడు. జట్టులో తనకు తెలిసినవాళ్లే ఎక్కువమంది ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం తమిళనాడులో లాక్‌డౌన్ అమల్లో ఉండటం వల్ల ఇంటివద్దే సాధన చేస్తున్నానని తెలిపాడు.
దేశవాళీ క్రికెట్లో సంచలనం సృష్టించిన ఆటగాడు షారుక్ ఖాన్. తమిళనాడుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు మంచి విజయాలు అందించాడు. డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటు. దాంతో ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఒకటి రెండు మ్యాచుల్లో విలువైన ఇన్నింగ్సులే ఆడినా పూర్తి స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకోలేకపోయాడు.
‘ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. కొన్నేళ్లుగా లీగ్‌ను టీవీలో చూస్తున్నాను. ఈ ఏడాది ఏకంగా ఆడేశాను. గొప్ప ఆటగాళ్లను కలిసే అవకాశం వచ్చింది. 2-3 ఇన్నింగ్స్‌లు బాగా ఆడాను. కుంబ్లే నన్ను పొలార్డ్‌తో పోల్చడం బాగుంది. అయితే నా కెరీర్ ఇప్పుడే ఆరంభమైంది. అతడి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా. పంజాబ్‌లోని చాలామంది ఆటగాళ్లతో నాకు అనుబంధం ఉంది. కేఎల్ రాహుల్, అనిల్ కుంబ్లే నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. తమిళనాడుకు ఎలా ఆడానో అలాగే ఆడమన్నారు. జట్టు పేరు మాత్రమే మారింది. బంతి, ఆట ఒకటేనన్నారు’ అని షారుక్ తెలిపాడు.
పంజాబ్ జట్టులో తనకు ప్రత్యేకమైన పాత్ర అప్పగించలేదని షారుక్ చెప్పాడు. చెన్నై పోరులో 4/5తో ఉండటంతో నిలకడగా ఆడుతూ 47 పరుగులు చేశానన్నాడు. పరిస్థితులను బట్టి ఆడానని పేర్కొన్నాడు. వికెట్లు పడుతుండటం వల్ల షాట్లు ఆడలేకపోయానని వెల్లడించాడు. లీగ్ వాయిదాపడే సమయానికే తాను వ్యక్తిగతంగా జోరందుకున్నానని చెప్పాడు. కానీ ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొంటే వాయిదా వేయడమే సరైందన్నాడు. ప్రస్తుతం రెండు మూడు నెలల విరామం దొరికిందన్నాడు.