టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై అపురూప విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న టీమ్ఇండియా అక్కడి భోజన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం నెదర్లాండ్‌పై మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం మధ్యాహ్న భోజనంగా తమకు కోల్డ్ సాండ్విచెస్(చల్లటివి) అందించడంపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ప్లేయర్స్ ఆ ఆహారాన్ని తినకుండా అలానే వదిలేశారు.
"ఇది బాయ్‌కాట్ కాదు. కొంతమంది ప్లేయర్స్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే వాళ్లు తిరిగి తమ హోటల్‌కు వెళ్లి తిన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఐసీసీ.. లంచ్‌లో హాట్ ఫుడ్‌ను ఏర్పాటు చేయలేదు. ద్వైపాక్షిక సిరిస్‌లో, ఆతిథ్యం ఇచ్చే బోర్డులు భోజనానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుంది. లంచ్‌లో వారెప్పుడూ ట్రైనింగ్ సెషన్ తర్వాత వేడివేడిగా ఇండియన్ మీల్స్(భారతీయ వంటకాలు) మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ ఐసీసీ అలా కాదు. అని జట్లకు ఒకటే నిబంధన పాటిస్తుంది. ఒకేరకమైన ఫుడ్ మెనును ఏర్పాటు చేస్తుంది. అయితే రెండు గంటల పాటు శిక్షణ చేసి అలసిపోయిన మన ఆటగాళ్లు చల్లని సాండ్విచ్లు తినడానికి తిరస్కరించారు. అయినా అందులో సరైన పోషకాలు కూడా ఉండవు." ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
అయితే ఈ సమస్య ఐసీసీ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ.. అవును, భారత జట్టు ప్రాక్టీస్ తర్వాత పెడుతున్న ఫుడ్ మెనుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చింది. త్వరలోనే దీనికి పరిష్కారం చూస్తాం." అని అన్నారు.
ఇవీ చదవండి : 'ఐపీఎల్ నా ఆట తీరు మార్చేసింది.. టోర్నీ వల్ల చాలా మెరుగయ్యా'
'టీమ్ఇండియాకు నయా జహీర్ ఖాన్'.. అర్ష్‌దీప్‌పై మాజీ కోచ్ కామెంట్స్