టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను పోల్చడం సరికాదని, అది అసంబద్ధమైన పోలికని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల భారత్, కివీస్ సారథులను ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలను అతడు తప్పుబట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ వాన్ అభిప్రాయాలను కొట్టిపారేశాడు. కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని అన్నాడు.
"కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అది మాత్రమే కాకుండా అతడి ఆట కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే 70 శతకాలు సాధించాడు. ఈ తరంలో ఎవరూ అన్ని సెంచరీలు చేయలేదు. అలాగే దీర్ఘకాలంగా ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని విలియమ్సన్‌తో పోల్చటం ఏ మేరకు సమంజసమో అర్థంకావడం లేదు"
-సల్మాన్ భట్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్
'వాన్ చెప్పింది అసంబద్ధం..'
"అలాగే వాళ్లిద్దరినీ పోల్చింది ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్. ఒక బ్యాట్స్‌మన్‌గా అతడి గణాంకాలు అంత మెరుగ్గా లేవు. టెస్టుల్లో మంచి బ్యాట్స్‌మనే అయినా వన్డేల్లో ఒక్క సెంచరీ చేయలేదు. ఒక బ్యాట్స్‌మన్‌గా ఒక్క శతకమూ సాధించని అతడు ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం అర్థరహితం. ఏదో ఒకటి మాట్లాడి అనవసర చర్చలను తెరపైకి తీసుకురావడం అతడికో అలవాటు. అయితే, విలియమ్సన్ గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మేటి ఆటగాడే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి. కానీ, వాన్ కెప్టెన్సీ విషయంపై మాట్లాడలేదు. ఆటగాళ్లుగా చూస్తే కోహ్లీ-విలియమ్సన్ మధ్య చాలా తేడా ఉంది. కోహ్లీ గణాంకాలు, ఆడే తీరు అత్యద్భుతం. ముఖ్యంగా ఛేదనలో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. వారిద్దరూ ఆడుతున్నప్పటి నుంచి కోహ్లీ అంత నిలకడగా ఎవరూ ఆడలేదు. ఈ విషయంలో వాన్ చెప్పిందంతా అసంబద్ధం" అని సల్మాన్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'కేన్ భారతీయుడైతే.. కోహ్లీని పట్టించుకునేవారే కాదు'