Salman Butt about Hardik: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శరీరం చాలా బలహీనంగా మారిందని, అతడు ఇలాగే ఉంటే ఒక్క ఫార్మాట్‌లో కూడా కొనసాగలేడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. అతడు శరీర దృఢత్వం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, సరైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యా నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేడని బట్ అభిప్రాయపడ్డాడు.
"హార్దిక్ పాండ్యా శరీరం చాలా బలహీనంగా ఉంది. ఇలాగే ఉంటే అతడు ఒక్క ఫార్మాట్‌లో కూడా కొనసాగలేడు. అతడు సరైన ఆహారాన్ని తీసుకుని శరీర బరువును, కండరాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాండ్యా తిరిగి నాలుగు ఓవర్లు వేయగలిగేలా కష్టపడాలి. అంటే ప్రస్తుతం అతడు సరిగ్గా నాలుగు ఓవర్లు కూడా వేయలేడని అర్థం."
-సల్మాన్ బట్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాత జరిగిన సిరీస్‌లకు హార్దిక్‌ను ఎంపిక చేయడం లేదు. ఐపీఎల్ 14 సీజన్‌లో పాండ్యా మెరవలేదు. 11 ఇన్నింగ్స్‌ల్లో 14.11 సగటుతో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కారణంగానే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ముంబయి ఇండియన్స్ అతడిని రిటెయిన్ చేసుకోలేదని పలువురు భావిస్తున్నారు. దీంతో అతడు మెగా వేలంలోకి వస్తున్నాడు.