Sachin Vinod Kambli: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ బాల్యం నుంచి మంచి స్నేహితులు. పాఠశాల రోజుల్లోనూ కలిసి క్రికెట్ ఆడారు. వారిద్దరికి క్రికెట్ ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ ఆచ్రేకర్. శారదాశ్రమం విద్యామందిర్‌లో కలిసి విద్యాభ్యాసం చేశారు. అయితే సచిన్ కెరీర్‌పరంగా ఎవరెస్టు ఎత్తుకు ఎదగగా.. కాంబ్లీ తొమ్మిదేళ్లలోనే ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే వీరిద్దరి స్నేహంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు.
తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ వినోద్ తాజాగా సామాజిక మాధ్యమంలో పాత ఫొటోను షేర్ చేశాడు. "ప్రపంచమంతా మనకు శత్రువుగా మారినా.. మన స్నేహం మాత్రం చెక్కుచెదరదు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆ ఫొటోలో సచిన్, కాంబ్లీతో పాటు మరో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
1988లో పాఠశాల స్థాయి క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ జోడీ సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లీ 349*, సచిన్ 326* పరుగులు చేశారు.
1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సచిన్ (1989-2013) మాస్టర్ బ్లాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్... రెండు ఫార్మాట్లు కలిపి వంద శతకాలు, 164 అర్ధశతకాలతో 34 వేలకుపైగా పరుగులు సాధించాడు. బౌలింగ్‌లోనూ 200 వికెట్లను పడగొట్టాడు. భారత జట్టుకు 24 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మరోవైపు వినోద్ కాంబ్లీ (1991-2000) మాత్రం కేవలం 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడాడు. తొమ్మిదేళ్ల కెరీర్‌లో మొత్తం ఆరు శతకాలు, 17 అర్ధశతకాలు బాదాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 3,500కిపైగా పరుగులు చేశాడు.