Sachin Tendulkar Anjali Love Story: సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వింటే చాలు అభిమానులకు ఎక్కడలేని సంతోషం. 1989లో టీమ్ఇండియాలోకి అడుగుపెట్టిన సచిన్.. రెండు దశాబ్దాలకు పైగా టీమ్ఇండియాకు తన సేవలు అందించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించడం సహా 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఘనత సచిన్ తెందుల్కర్ సొంతం. అందుకే అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే సచిన్.. 17 ఏళ్ల వయసుకే అంజలీ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనకన్నా వయసులో దాదాపు ఆరేళ్లు పెద్ద అయిన అంజలీని 1995లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే అంజలీతో వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సచిన్. రెండు కుటుంబాలనూ పెళ్లికి ఒప్పించే బాధ్యత అంజలీకే అప్పగించానని సచిన్ చెప్పుకొచ్చాడు.
అందుకే అలా..
పెద్దలను ఒప్పించి తాము ఎలా పెళ్లి చేసుకున్నామో సచిన్ ఇటీవల ఓ టీవీ షోలో వెల్లడించాడు.
"1994లో న్యూజిలాండ్ పర్యటన సమయంలో అది జరిగింది. ఆక్లాండ్, వెల్లింగ్టన్లలో వరుసగా చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్నాను. అప్పుడే అంజలీ నన్ను కలిసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. నేను సరే అన్నాను. కానీ రెండు కుటుంబాలతో నువ్వే మాట్లాడి ఒప్పించాలని చెప్పాను. అప్పటికే ఇంట్లో వారికి అంజలీతో పరిచయం ఉన్నా నాకు ఎందుకో పెళ్లి విషయం మాట్లాడాలి అంటే ఇబ్బందిగా అనిపించింది. అందుకే నువ్వు ఇరు కుటుంబాలను ఒప్పిస్తే రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని అంజలీతో అన్నాను. అంజలీనే మా పెళ్లి గురించి అందరినీ ఒప్పించింది"
-సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
1995 మే 24న సచిన్-అంజలీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 1997లో సారా, 1999లో అర్జున్ జన్మించారు. 24 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు వెన్నెముకగా నిలిచిన సచిన్ 2013లో ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. మరోవైపు తండ్రి బాటలోనే అర్జున్ క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ అతడిని దక్కించుకుంది.
ఇదీ చూడండి : 'టీ20 వరల్డ్‌కప్ కోసం టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది'