Sachin Lata Mangeshkar: సగటు భారతీయుడిలా లతా మంగేష్కర్‌కు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు.. ఆమె భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశారు. ఆమె సింగర్ కదా.. క్రికెట్‌కు సేవ ఏంటీ అనుకుంటున్నారా..? నిజమే.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు ఆమె సాయంతోనే నజరానాలు అందాయి. ఇక భారత క్రికెట్ గాడ్ సచిన్ అంటే లతాకు వల్లమాలిన ప్రేమ. ఆమెను సచిన్ తెందుల్కర్ ప్రేమగా 'ఆయ్'(అమ్మ) అని పిలుస్తాడు. ఆ పిలుపునకు ఆమె పులకించిపోతుంది.. సచిన్ వంటి బిడ్డను తనకు ఇచ్చినందుకు ధన్యురాలిని అంటారామె. ఇది సచిన్‌తో ఉన్న బంధం..! లత మొదటి నుంచి క్రికెట్‌ను బాగా ఇష్టపడతారు.
1983 విశ్వవిజేతల కోసం..
1983 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి వెళ్లే సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వద్ద సరైన నిధులు కూడా లేవు. జట్టుకు డాక్టర్, ఫిజియో ఇతర స్టాఫ్ కూడా లేరు. 1983 ప్రుడెన్షియల్ కప్ (ప్రపంచ కప్) గెలిచాక టీమ్ ఇండియాలోని ఆటగాళ్లకు నజరానాలు ఇచ్చేందుకు కూడా బీసీసీఐ నిధులకు కటకటలాడుతోంది. భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయం అది. క్రికెట్ బోర్డులోని రాజ్ సింగ్ దుంగాపూర్ ఓ ఐడియాతో వచ్చాడు. ఆయన ఇంటికి పొరుగున ఉన్న లతా మంగేష్కర్‌తో దిల్లీలో సంగీత విభావరి నిర్వహించి వచ్చిన నిధులను క్రీడాకారులకు నజరానా ఇద్దామని తెలిపాడు. తర్వాత నాటి బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే నేరుగా వెళ్లి లతాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘క్రీడాకారులకు భవ్యస్వాగతం ఇవ్వాలనుకుంటున్నాం.. ఇది జరగాలంటే మీరు ఒక్క షో చేయాల’ని అని ఆయన లతాను కోరారు. ఆమె కూడా అంగీకరించింది. ఆగస్టు 17వ తేదీన దిల్లీలో నిర్వహించిన ఈ షో సూపర్ సక్సెస్ అయింది. లతా సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన ‘భారత్ విశ్వ విజేత’ పాట అందర్నీ ఆకట్టుకొంది. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ షో నుంచి 20 లక్షల రూపాయలను సమీకరించారు. అప్పట్లో ఇది పెద్దమొత్తమే. ఒక్కో ఆటగాడికి లక్షరూపాయల నజరానా అందింది. ‘‘ఆ రోజుల్లో నేను తొలిసారి చూసిన అతిపెద్ద మొత్తం అదే’’ అని దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఫంక్షన్‌లో కపిల్ దేవ్ స్వయంగా వెల్లడించారు. దిల్లీలో సంగీత విభావరిలో పాడినందుకు లతా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
- లతా మంగేష్కర్ వద్ద క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ సంతకం చేసిన చిత్రం ఒకటి ఉంది. ఆమె అప్పుడప్పుడు టెస్ట్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లేవారు.
సచిన్‌తో ఆత్మీయ అనుబంధం..
"క్రీడాకారులంతా మంచి వారే.. కానీ, నా ఫేవరెట్ మాత్రం సచిన్. అందరూ సచిన్‌ను ఇష్టపడతారు.. అలాంటి అభిమానుల జాబితాలో నేనెందుకు వెనుకబడాలి" అంటూ సచిన్‌పై ఉన్న అభిమానాన్ని ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ బయటపెట్టారు. 2013లో సచిన రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో ఆమె చాలా బాధపడ్డారు. ఆ వార్త తెలిసిన తర్వాత మరోసారి మైదానంలో సచిన్ ఆటను చూడలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. కాకపోతే ప్రతి క్రీడాకారుడు ఎల్లకాలం ఆడలేరు అనే వాస్తవాన్ని అర్థం చేసుకొన్నారు. సచిన్ రిటైర్మెంట్‌పై ఆమె స్పందిస్తూ "ఆ వార్త విని చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు.
సచిన్ 100 శతకాలు పూర్తయ్యాక..
2012లో సచిన్ 100 అంతర్జాతీయ శతకాలను పూర్తి చేసుకోవడంతో ముంబయి నగరం మొత్తం సంబరాలు చేసుకొంది. ఆ సమయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేమాహేమీలు పాల్గొన్నారు. లతా మంగేష్కర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అక్కడ సచిన్ ఆమెను తన కోసం ఒక్క పాట పాడమని కోరారు. ఆ సందర్భంగా లతా 'తూ జహా జహా చలేగీ' పాటను ఆలపించారు.
- సచిన్ తరచూ లతా సంగీత కార్యక్రమాలకు హాజరయ్యే వాడు. ఒకసారి సచిన్ వచ్చినా.. ఆమె గుర్తించలేదు. ఆ సమయంలో లతా సోదరుడు వచ్చి సచిన్ హాజరైన విషయాన్ని తెలిపారు. అప్పుడామే స్టేజీ మీద నుంచి సచిన్‌కు నమస్తే చెప్పారు.
- సచిన్ 'భారత్ రత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిలో లతా మంగేష్కర్ ఒకరు. 2010లో ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ 'సచిన్‌లా దేశానికి సేవ చేసిన వారు చాలా తక్కువ మంది' అని పేర్కొన్నారు.
- సచిన్ అర్ధ శతకం లేదా శతకం పూర్తి చేశాక ఆకాశంలోకి చూస్తూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడం తనకు బాగా నచ్చుతుందని లతా మంగేష్కర్ ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాయిబాబా విగ్రహాన్ని బహూకరించి..
లతా మంగేష్కర్ తొలిసారి సచిన్‌ను కలిసింది రాజ్ ఠాక్రే నివాసంలో. సచిన్ బర్త్‌డే పార్టీని అక్కడ నిర్వహిస్తుండగా లతాకు ఆహ్వానం వచ్చింది. ఆ పార్టీలో సచిన్‌కు ఆమె ఒక సాయిబాబా విగ్రహాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా సచిన్ ఆమెకు పాదాభివందనం చేసి "మీరు నా తల్లితో సమానం" అని అన్నారు. ఆ మాటలకు లతా చలించిపోయారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో సచిన్ తనను 'ఆయ్'( అమ్మ) అని పిలిచిన విషయాన్ని గుర్తు చేసుకొని లతా చాలా సంబరపడ్డారు.
ధోనీ నువ్వు రిటైర్ అవ్వొద్దు..
క్రికెట్ ప్రేమను లతా 2019లో మరోసారి బయటపెట్టారు. ఆ సమయంలో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయం లతా చెవిని పడింది. ఆమె కూడా సగటు క్రికెట్ అభిమానిలా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించకూడదని కోరుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె మనసులో దాచుకోకుండా.. ట్విటర్ వేదికగా ధోనిని అభ్యర్థించారు. 'దేశానికి మీ సేవలు చాలా అవసరం’ అని కోరారు.
భారత్ అండర్-19 ప్రపంచ కప్‌ను ఐదోసారి గెలుచుకొన్న రోజే ఈ క్రికెట్ అభిమాని కన్నుమూయడం విషాదం. లతా మరణ వార్త తెలిసిన వెంటనే సచిన్ హుటాహుటిన బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.
ఇదీ చూడండి : క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత