రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వస్తున్న వార్తలపై న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ స్పందించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని అన్నాడు. తాను ఆటకు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉందని, త్వరగా వీడ్కోలు పలకాలనే తమ దేశ సంప్రదాయాన్ని తాను మారుస్తానని చెప్పాడు. 37ఏళ్ల టేలర్.. ఏడోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో టీమ్ఇండియాతో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆడనున్నాడు.
"నా అభిప్రాయం ప్రకారం వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ఆస్వాదించినన్ని రోజులు ఆటలో కొనసాగుతాను. ఇంతకు ముందు 30ల్లో వేగంగా ఆడలేక చాలామంది కివీస్ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకున్నారు. నేను మాత్రం దాన్ని అధిగమిస్తాను. అలానే తక్కువ వయసప్పుడే వీడ్కోలు పలకాలనే విధానం నా వల్ల మారుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడున్న ఆటగాళ్లు 37ఏళ్ల వచ్చినా సరే ఆటలో ఉండాలని కోరుకుంటున్నాను" అని టేలర్ చెప్పాడు.
ఐపీఎల్ త్వరగా ముగియడం, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యేందుకు ఉపకరిస్తుందని టేలర్ అభిప్రాయపడ్డాడు. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ ఈ పోరు జరగనుంది.