మరో మూడు రోజుల్లో భారత్‌లో క్రికెట్ సంబరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంకానుంది. మార్చి 31 నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాటర్ల ధనాధన్ ఇన్నింగ్స్, బౌలర్ల మ్యాజిక్, ఫీల్డర్ల విన్యాసాలు చూసేందుకు ఆత్రుతగా ఉన్నారు. అయితే ఈ తాజా 16వ ఎడిషన్‌లో ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. పలు రికార్డులు బ్రేక్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఓ సారి ఆ రికార్డులేంటో తెలుసుకుందాం..
- ఐపీఎల్‌లో అత్యధిక శతకాల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. జాస్ బట్లర్(5), రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(5), రాహుల్(4), దిల్లీ వార్నర్(4) ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది.
- ఐపీఎల్‌లో సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ రికార్డును రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అధిగమించే అవకాశముంది. ప్రస్తుతం అతడు 166 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో అతను మరో 18 వికెట్లు పడగొడితే బ్రావో రికార్డు బద్దలు అవుతుంది.
- ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సీజన్‌లో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో డకౌట్ అయితే.. మన్‌దీప్ సింగ్‌ను(14) అధిగమిస్తాడు. అత్యధిక డక్స్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
- ఈ సీజన్‌లో ఏబీ డివిలియర్స్(251) పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డును రోహిత్ శర్మ (240) అధిగమించే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) కొనసాగుతున్నాడు.
- సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ రానున్న ఐపీఎల్ సీజన్‌లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకోవచ్చు. ప్రస్తుతం అతడు ఈ మెగాటోర్నీలో 234 మ్యాచ్‌లు ఆడి అగ్రస్థానంలో ఉన్నాడు.
- ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచులు సురేశ్ రైనా(109) పేరిట ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ(97), విరాట్ కోహ్లీ(93) క్యాచ్‌లతో కొనసాగుతున్నారు. వీరిద్దరు.. 100 క్యాచ్‌ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్.. ఈ సీజన్‌లో 7వేల పరుగుల మార్క్‌ను అధిగమించొచ్చు. కోహ్లీ ప్రస్తుతం 6624 పరుగులతో కొనసాగుతుండగా.. ధావన్ 6244 రన్స్‌తో ఉన్నాడు. ఇంకా వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879).. 6వేల పరుగుల క్లబ్‌లో చేరే అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి: క్రికెట్ కిట్ కొనేందుకు రోహిత్ శర్మ పాల ప్యాకెట్లు వేశాడట