జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International YOGA Day) పురస్కరించుకుని.. దేశంలోని 9 రాష్ట్రాలలో 25 ఫిట్ ఇండియా యోగా సెంటర్లను (Fit India Yoga Centers) ప్రారంభించింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆయూష్ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.
"మన ప్రాచీన వారసత్వంలో భాగమైన యోగా.. ప్రస్తుత కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా. నిత్యం యోగాసనాలు వేస్తే శారీరక, మానసిక ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఈ కొత్త యోగా కేంద్రాల ద్వారా మరింత మందికి యోగా ప్రాముఖ్యత తెలుస్తుంది."
-కిరెన్ రిజిజు, కేంద్ర ఆయూష్ మంత్రి.
దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో మొత్తం 25 ఫిట్ ఇండియా యోగా కేంద్రాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా వీటన్నింటికి ఫిట్ ఇండియా సర్టిఫికెట్లను అందజేయనున్నారు.
వీటిలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో 5 కేంద్రాలను గుర్తించగా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 4 చొప్పున సెంటర్లను కేటాయించారు. మధ్యప్రదేశ్లో 3, తమిళనాడులో 2, ఉత్తరాఖండ్, పంజాబ్, దిల్లీకి ఒకటి చొప్పున ఫిట్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Olympics: 'అథ్లెట్ ఇంజూరీ మేనేజ్మెంట్ సిస్టమ్' ఏర్పాటు