ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్(IPL 2021 schedule)లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ప్రపంచకప్ తేదీలకు(T20 worldcup schedule), ఐపీఎల్‌కు మధ్య రెండ్రోజుల సమయం మాత్రమే ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. లీగ్ 14వ సీజన్ ఫైనల్‌ను అక్టోబర్ 10న నిర్వహించాలని.. తద్వారా ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లకు వారం రోజుల విశ్రాంతైనా లభిస్తుందనేది బోర్డు ఆలోచన.
టీ20 ప్రపంచకప్‌ను అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈతో పాటు ఒమన్ వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, ఐపీఎల్‌ను అంతకుముందే.. అదే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఈ రెండు టోర్నీల మధ్య రెండ్రోజుల సమయం మాత్రమే ఉండడం వల్ల ఐపీఎల్‌ను వారం రోజులు ముందుకు జరపాలని బోర్డు భావిస్తోంది. అక్టోబర్ 24 నుంచి ప్రధాన జట్లు పొట్టి కప్‌లో పాల్గొనాల్సి ఉండగా.. 17 నుంచి చిన్న దేశాలు క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ఆడతాయి.
కొవిడ్ కారణంగా భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించింది ఐసీసీ. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది. టోర్నీ నిర్వహణ నాటికి దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేమని కూడా ఐసీసీకి విన్నవించుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి షెడ్యూల్‌తో పాటు వేదికను ప్రకటించింది ఐసీసీ.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే.. ఆ హక్కులు భారత్‌వే!