అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) మ్యాచ్‌లకు టీమ్ఇండియా స్క్వాడ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. అయితే.. శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను(Shreyas Iyer News) కూడా పక్కనపెట్టారు. అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవడానికి కారణమేంటో జట్టు ప్రకటన అనంతరం వివరించారు సెలక్షన్ ప్యానెల్ అధ్యక్షుడు చేతన్ శర్మ.
"ఇషాన్ కిషన్ ఓపెనర్లా ఆడగలడు. మిడిలార్డర్లో కూడా రాణించగలడు. ఇప్పటికే కిషన్ వన్డేల్లో ఆడాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేశాడు. మిడిలార్డర్, స్పిన్‌లో కూడా అతడు బాగా ఆడతాడు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ జట్టుకు అవసరం. అందుకే శ్రేయస్‌కు బదులుగా ఇషాన్‌కు స్థానం కల్పించాం. శ్రేయస్ కొన్ని రోజుల వరకు క్రికెట్ దూరంగా ఉన్నందున అతడిని స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉంచాం."
-చేతన్ శర్మ, సెలక్షన్ ప్యానెల్ అధ్యక్షుడు.
మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్ భుజానికి గాయమైంది. దీంతో అతడు కొన్ని రోజులపాటు ఆటకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత టీ20 జట్టులో చోటు సంపాదించాడు.
ధావన్‌కు నిరాశే..
టీ20 జట్టులో శిఖర్ ధావన్(Shikhar Dhawan Latest News) చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని.. దాంతో పెద్దగా ఉపయోగం ఉండదని సెలక్టర్లు భావించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అందుకే అతడి స్థానంలో ధనాధన్ బ్యాటింగ్ నైపుణ్యం చూపే ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి.
టీమ్ఇండియా స్క్వాడ్:విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
ఇదీ చదవండి:T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్ జట్టు.. మెంటార్‌గా ధోనీ