డుప్లెసిస్ సారథ్యంలో ఆర్‌సీబీ చరిత్రలో కొత్త శకం ఆరంభం కాబోతోంది. పదేళ్లు కెప్టెన్‌గా ఉన్న కోహ్లి బాధ్యతల నుంచి వైదొలగాడు. ఇప్పుడు డుప్లెసిస్ నేతృత్వంలో బెంగళూరు ఎలా ఆడబోతోందన్నది ఆసక్తికరం. పదేళ్లు చెన్నైకి ఆడిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌కు అంతర్జాతీయ నాయకత్వ అనుభవం బాగానే ఉంది. మంచి వ్యూహ చతురుడు కూడా. డుప్లెసిస్ ఒక్కడే కాదు.. నాయకత్వ అనుభవమున్న బృందమే బెంగళూరుకు ఉంది. మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, కోహ్లి.. డుప్లెసిస్‌తో కలిసి పని చేయనున్నారు. వేలంలో దేశవాళీ, విదేశీ ఆటగాళ్లపై భారీగా వెచ్చించిన బెంగళూరు ధీమాతో ఉంది. యుజ్వేంద్ర చాహల్ లాంటి మ్యాచ్ విన్నర్‌ని కోల్పోయినా శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగను రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది. అతడితో పాటు హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), హేజిల్‌వుడ్ (రూ.7.75)పై కోట్లు పోసి బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకుంది. బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, కోహ్లి, డుప్లెసిస్ లాంటి వాళ్లు ధీమానిస్తున్న నేపథ్యంలో.. బెంగళూరు ప్లేఆఫ్స్‌కు బలమైన పోటీదారే. కానీ ఎప్పుడూ వెంటాడే అస్థిరతను ఎలా అధిగమిస్తుందన్నదే చూడాలి.
![RCB IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14807553_22sp2a_3.jpg)
బలాలు
తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతున్న బెంగళూరుకు డుప్లెసిస్ నాయకత్వం కచ్చితంగా పెద్ద సానుకూలాంశం. అతడి ఎటాకింగ్ కెప్టెన్సీ, ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం జట్టుకు చాలా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. బ్యాట్స్‌మన్‌గా కూడా అతడు కీలకం కానున్నాడు. గత సీజన్‌లో అతడు 16 మ్యాచ్‌ల్లో 633 పరుగులతో చెన్నై టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. డుప్లెసిస్, కోహ్లీల ఓపెనింగ్ జోడీతో ప్రత్యర్థులకు ముప్పే. ఇద్దరూ క్రీజులో పాతుకుపోగలరు. ఇద్దరూ బ్యాట్ ఝుళిపించగలరు. వీళ్లిద్దరు బలమైన ఆరంభాలనిస్తే.. మిగతా పని మ్యాక్స్‌వెల్, కార్తీక్ చూసుకుంటారని బెంగళూరు ఆశిస్తోంది.
![RCB IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14807553_fot_ht5ucaiaebl.jpg)
అయితే బౌలింగ్‌లో ఆ జట్టు ఇంకా బలంగా కనిపిస్తోంది. సిరాజ్, హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్‌తో కూడిన పదునైన పేస్ దళం ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌నైనా బెంబేలెత్తించగలదు. హసరంగ, షాబాజ్ అహ్మద్‌లతో స్పిన్ విభాగం పర్వాలేదు. జేసన్ బెరెన్‌డార్ఫ్, డేవిడ్ విల్లీ కూడా జట్టులో ఉన్న నేపథ్యంలో బెంగళూరు బౌలింగ్ విభాగం మెరుగ్గానే కనిపిస్తోంది. బౌలర్లు సత్తా మేరకు రాణిస్తే ఆ జట్టు ప్రయాణం సాఫీగా సాగుతుంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అనుజ్ రావత్, ఆల్‌రౌండర్ అనీశ్వర్ గౌతమ్ రూపంలో యువ ప్రతిభావంతులు కూడా బెంగళూరు జట్టులో ఉన్నారు.
బలహీనతలు
కొద్ది మంది స్టార్లున్నా బెంగళూరు బ్యాటింగ్ ఒకప్పటంత గొప్పగా కనిపించట్లేదు. డివిలియర్స్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి రిటైర్మెంట్‌తో మధ్య, ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించే ఓ బ్యాట్స్‌మన్‌ను ఆ జట్టు కోల్పోయింది. దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌పై మరింత భారం పడనుంది. విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయలేం కానీ.. అతడు ఇటీవల పరుగుల వేటలో వెనుకబడడం, సాధికారికంగా ఆడలేకపోతుండడం బెంగళూరుకు సమస్యే. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌పై మరింత బాధ్యత ఉంది. కోహ్లి జోరందుకోకపోతే ఇబ్బందే. ఈ ముగ్గురు కాకుండా బ్యాటుతో మరో మ్యాచ్ విన్నర్ ఉన్నాడా అంటే సమాధానం చెప్పడం కష్టమే. దినేశ్‌కార్తీక్ ప్రతిభావంతుడే అయినా.. అతడి నిలకడలేమి పెద్ద సమస్య. తుది జట్టులో ఆడే అవకాశాలున్న రావత్, లొమ్రార్ ప్రతిభావంతులే అయినా.. గత రెండు సీజన్లలో జట్టుకు బాగా ఉపయోగపడ్డ దేవ్‌దత్ పడిక్కల్‌లాగా రాణించగలరా గెలిపించగలరా అన్నది ప్రశ్న!
బెంగళూరుకు పెద్ద ప్రతికూలాంశమేంటంటే.. వీళ్లకు మించిన ప్రత్యామ్నాయాలు కనిపించట్లేదు. ఒకవేళ రావత్ ఓపెనింగ్ చేస్తే.. కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. మొత్తం 25 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశమున్నా.. బెంగళూరు 22 మందితోనూ సరిపెట్టుకుంది. ఇంకా రూ.1.55 కోట్లు మిగిలాయి. అమ్ముడుపోని వారిలో మంచి బ్యాట్స్‌మెనే ఉన్నారని, మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను అయినా బెంగళూరు తీసుకోవాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది.
దేశీయ ఆటగాళ్లు: కోహ్లి, దినేశ్ కార్తీక్, సిరాజ్, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ కౌల్, లొమ్రార్, ఆకాశ్ దీప్, అనుజ్ రావత్, అనీశ్వర్ గౌతమ్, చామ మిలింద్, సుయాశ్, షాబాజ్ అహ్మద్, కర్ణ్ శర్మ, లవ్నిత్ సిసోడియా
విదేశీయులు: డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హసరంగ, ఫిన్ అలెన్, బెరెన్‌డార్ఫ్, హేజిల్‌వుడ్, షెర్ఫాన్ రూథర్డ్‌ఫోర్డ్, డేవిడ్ విల్లీ
వీళ్లు కీలకం: మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, కోహ్లి, హసరంగ, సిరాజ్, హర్షల్ పటేల్
ఉత్తమ ప్రదర్శన: 2009, 2011, 2016లో రన్నరప్
ఇదీ చదవండి: 'ఫినిషర్‌గా ధోనీ ఇక కష్టమే.. ఆ పని చేస్తే బెటర్'