టీమ్ఇండియా ఆల్‌రౌండర్ జడేజా కారణంగా టెస్టు జట్టులోకి తన ఎంట్రీ ఆలస్యమైందని అన్నాడు మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. వన్డే(2014), టీ20(2015) జట్టులోకి అరంగేట్రం చేసిన అతడికీ టెస్టుల్లోకి రావడానికి ఆరేళ్లు పట్టింది.
"నా నైపుణ్యాల్లో కొరత ఉందనుకోను. దురదృష్టవశాత్తు గాయపడటం వల్ల వన్డేల్లో చోటు కోల్పోయా. ఇక టెస్టుల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. జడ్డూ అత్యుత్తమ ఆటతీరుతో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం కష్టం. మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్ రాణిస్తున్నారు. జట్టు కూర్పు వల్లే నాకు చోటు దొరకలేదు. మళ్లీ అవకాశం దొరకగానే నన్ను నేను నిరూపించుకున్నా" అని అక్షర్ అన్నాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు అక్షర్. ఈ సిరీస్‌లో 10.59 సగటుతో 27వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. కాగా, జూన్ 18 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ప్రకటించిన జట్టుకు ఎంపికయ్యాడు.
యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన సన్నిహితుల్లో ఒకడని అక్షర్ చెప్పాడు. జట్టు వాతావరణాన్ని సరదాగా మార్చడంలో, జోకులు పేల్చడంలో అతడికి తిరుగులేదని పేర్కొన్నాడు. "అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో మా ఇద్దరిదీ ఒకే జట్టు. పంత్ నాకు సన్నిహితుడు. జట్టు వాతావరణంలో అతడు జోష్ నింపుతాడు. వికెట్ల వెనకాల ఉండీ అతడు జోకులు పేల్చగలడు. కొన్నిసార్లు టెస్టుల్లో ప్రత్యర్థి భాగస్వామ్యాలు విడదీయడం కష్టమవుతుంది. ఆటగాళ్లు నిరుత్సాహ పడకుండా వారిలో ఉత్సాహం నింపే బాధ్యతను అతడు తీసుకుంటాడు. అంతేకాకుండా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అతడికవి నప్పుతాయి" అని అక్షర్ తెలిపాడు.
ఇదీ చూడండి అక్షర్ కళ్లద్దాలతో ఆనంద్ మహీంద్ర.. చెప్పింది చేశాడుగా!