Ravikumar U19 Cricketer: అండర్ -19 ప్రపంచకప్ విజేత టీమ్‌ఇండియా జట్టులో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. టోర్నీ ఆసాంతం అద్భుతమైన బౌలింగ్‌తో కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రవికుమార్ ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ వాసి. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మ్యాచ్‌లో (4/34) సూపర్ స్పెల్ వేశాడు. స్వయం కృషితో పాటు కుటుంబత్యాగం వల్లే రవికుమార్ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. రవికుమార్ తండ్రి రజిందర్ సింగ్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్నారు. తన కుమారుడు ప్రపంచకప్ హీరోగా మారేసరికి రజిందర్ సంతోషానికి అవధుల్లేవు. "మేం బుల్లెట్లతో దేశ రక్షణ కోసం పని చేస్తున్నాం. నా కుమారుడు అతడి బౌలింగ్‌తో టీమ్‌ఇండియాకు సేవలందిస్తున్నాడు" అని తెలిపారు. ప్రస్తుతం రజిందర్ సింగ్ ఒడిశాలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన రాయగడ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒడిశాకు రాకముందు శ్రీనగర్‌లో రజిందర్ సింగ్ విధులు నిర్వర్తించారు. తన జీవితంలో ఎక్కువగా మిలిటెంట్ల రీజియన్లలోనే గడిపానని, అయితే తన భార్య, ముగ్గురు పిల్లలు ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గతంలో ఓ సంఘటన గురించి రజిందర్ సింగ్ గుర్తుకు తెచ్చుకున్నారు. 2006లో శ్రీనగర్‌లో విధుల్లో ఉండగా మిలిటెంట్ల దాడి జరిగిందని, అందులో ఒకరు మృతి చెందగా..తనతో సహా పదకొండు మంది సైనికులు గాయపడ్డారని పేర్కొన్నారు. అప్పుడు రవికుమార్ చాలా చిన్నవాడు. తన కష్టాలను ఎప్పుడూ కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించలేదని, తీవ్రంగా గాయపడిన విషయాన్ని కూడా చెప్పలేదన్నారు. "ఎల్లప్పుడూ నా కుటుంబ సభ్యులను సంతోషంగా ఉండేలా చూసుకున్నా. నేను అనుభవించిన బాధలను వారికి తెలియనీయకుండా ఉండేవాడిని. ఉగ్రదాడిలో కాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడినా దాని గురించి వారికి చెప్పలేదు. టీవీలో చూసిన తర్వాతే వారంతా నా దగ్గరకు వచ్చారు" అని రజిందర్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి : Lata Mangeshkar: సచిన్‌తో అమ్మా అని పిలిపించుకొని..!