Rahul Tewatia Wedding: టీమ్ఇండియా, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రాహుల్ తెవాటియా ఓ ఇంటివాడయ్యాడు. స్నేహితురాలు రిధి పన్నుతో ఇతడి వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీమ్ఇండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్ దంపతులు, పంత్, నితీష్ రానాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూసిన నెటిజన్లు.. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 3న నిశ్చితార్థం చేసుకున్నారు.
Rahul Tewatia IPL: గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరిస్తున్నాడు తెవాటియా. 2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)తో జరిగిన మ్యాచ్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా ఐదు సిక్సులు బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయినా భారత జట్టు సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఇతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పవచ్చు.