టెస్టు క్రికెట్‌లో 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా మేటి జట్టనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దాని దూకుడుకు కళ్లెం వేసింది టీమ్‌ఇండియా. 2000లో తొలిసారి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టులో సంచలన విజయం సాధించిన భారత జట్టు.. 2003లో మరోసారి వారి సొంతగడ్డపైనే గడగడలాడించింది. డిసెంబర్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ - వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ గురించి కొంతమందికి తెలిసినా.. చాలా మటుకు మరిచిపోయి ఉంటారు. అయితే, టీమ్‌ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఒకటైన దీన్ని లాక్‌డౌన్ వేళ ఓ సారి గుర్తు చేసుకుందాం..
![rahul dravid and vvs laxman made india won the adelaide test against australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11840198_2.jpg)
మానసికంగా దెబ్బకొట్టి..
అడిలైడ్ టెస్టులో రికీ పాంటింగ్ సారథ్యంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దాంతో భారత్‌ను ముందే మానసికంగా బెదరగొట్టింది. పాంటింగ్ (242; 352 బంతుల్లో 31x4) ఓర్పుతో బ్యాటింగ్ చేసి ద్విశతకం సాధించగా.. ఓపెనర్ లాంగర్ (58; 72 బంతుల్లో 7x4, 2x6), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సైమన్ కటిచ్ (75; 109 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే చివర్లో జేసన్ గిలెస్పీ (48; 53 బంతుల్లో 6x4) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 550 దాటించాడు. టీమ్‌ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఐదు వికెట్లు తీయగా ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ ఒక వికెట్ తీశాడు.
![rahul dravid and vvs laxman made india won the adelaide test against australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11840198_3.jpg)
అదరని బెదరని ఈడెన్ హీరోలు..
ఆపై టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కినా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన గంగూలీ సేన 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆకాశ్ చోప్రా (27), వీరేంద్ర సెహ్వాగ్ (47), సచిన్ (1), గంగూలీ (2) విఫలమయ్యారు. ఇక మిగిలింది ద్రవిడ్, లక్ష్మణ్, పార్థివ్ పటేల్ మాత్రమే. ఒకవైపు కొండంత లక్ష్యం.. మరోవైపు భీకరమైన బౌలర్లు. అయినా పట్టుదలతో బ్యాటింగ్ చేశారు ఈడెన్ గార్డెన్స్ హీరోలు. ద్రవిడ్ (233; 446 బంతుల్లో 23x4, 1x6), లక్ష్మణ్ (148; 282 బంతుల్లో 18x4) కంగారూ బౌలర్లకు పరీక్ష పెట్టారు. చూడచక్కని షాట్లతో ఏ బౌలర్‌నూ వదలలేదు. గిలెస్పీ, ఆండీ బిచెల్, స్టువర్ట్ మాక్‌గిల్‌లను ఆటాడుకున్నారు. ఐదో వికెట్‌కు 303 పరుగులు జోడించి జట్టును పోటీలో నిలిపారు. ఇక 150కి చేరువైన వేళ లక్ష్మణ్ ఔటయ్యాక ద్రవిడ్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 523కు చేరవేశాడు. దాంతో కంగారూలకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
![rahul dravid and vvs laxman made india won the adelaide test against australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11840198_4.jpg)
పాంటింగ్ తుస్.. ఆసీస్ మటాష్..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరమితం చేసింది. ఇక్కడ కీలకంగా ఆడింది అగార్కర్. 6/41 ప్రదర్శనతో నిప్పులు చెరిగే బంతులేశాడు. చివరికి ఆస్ట్రేలియా 196 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు జస్టిన్ లాంగర్ (10), మాథ్యూ హెడెన్ (17)తో పాటు కెప్టెన్ పాంటింగ్ డకౌటై పూర్తిగా విఫలమయ్యారు. ఆపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ (38), స్టీవ్‌వా (42), సైమన్ కటిచ్ (31), ఆడం గిల్‌క్రిస్ట్ (43) పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడం వల్ల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 23 పరుగులు కలుపుకొని 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
![rahul dravid and vvs laxman made india won the adelaide test against australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11840198_5.jpg)
బంతితో తిరుగుబాటు.. టీమ్‌ఇండియా తడబాటు..
మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు చివరి రోజు పెద్ద పరీక్షే ఎదురైంది. అప్పటికే నాలుగు రోజులు గడవడం వల్ల పిచ్ మందకొడిగా మారింది. మోస్తరు లక్ష్యమే అయినా మరోవైపు బంతి అనూహ్యంగా తిరగడం మొదలెట్టింది. అలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలా గెలుస్తుందనే దానిపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయినా భారత జట్టు బెదరకుండా పోరాడింది. చోప్రా (20), సెహ్వాగ్ (47) శుభారంభం. ఆపై ద్రవిడ్ (72 నాటౌట్; 170 బంతుల్లో 7x4), సచిన్ (37; 59 బంతుల్లో 5x4) నిలకడైన ఆట తీరుతో వికెట్లు పడుండా అడ్డుకున్నారు. మధ్యలో గంగూలీ (12) విఫలమైనా లక్ష్మణ్ (32; 34 బంతుల్లో 6x4)తో కలిసి ద్రవిడ్ మిగతా పని పూర్తి చేశాడు. అలా కంగారూల గడ్డపైనే క్లిష్ట పరిస్థితుల్లో టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం సాధించింది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టెస్టులు డ్రాగా ముగియగా, రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా, మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందడం మూలంగా సిరీస్ సమం అయింది.
ఇదీ చూడండి: ఆటతోనే కాదు అందంతోనూ అదరగొట్టేస్తారు!