ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన నాటి నుంచి టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. న్యూజిలాండ్‌లో మినహా ఎక్కడా సిరీస్ ఓడిపోలేదు. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సగర్వంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా కివీస్ జట్టుతో తుదిపోరులో తలపడనుంది. అయితే, ఇంత ముఖ్యమైన మ్యాచ్‌కు టీమ్‌ఇండియా శుక్రవారం 24 మందితో కూడిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. అందులో హార్దిక్ పాండ్య, పృథ్వీషా, భువనేశ్వర్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లకు చోటుదక్కలేదు. మరి ఈ ముగ్గురిని బీసీసీఐ ఎందుకు పక్కనపెట్టిందోనని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నో బౌలింగ్.. నో హార్దిక్..
హార్దిక్ పాండ్య 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాంతో అప్పటి నుంచీ అతడు బౌలింగ్‌కు దూరమయ్యాడు. తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన పాండ్య లాక్‌డౌన్ తర్వాత ఐపీఎల్‌లో ఆడాడు. కానీ అక్కడ బౌలింగ్ చేయలేకపోయాడు. ఆపై ఆస్ట్రేలియా పర్యటనలోనూ హార్దిక్ ఒక మ్యాచ్‌లో మినహా ఎక్కడా బంతి అందుకోలేదు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీసుల్లోనూ చాలా తక్కువ ఓవర్లే బౌలింగ్ చేశాడు. తర్వాత ఐపీఎల్ 14వ సీజన్‌లోనూ రోహిత్ బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ గమనిస్తే పాండ్య బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేడని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. టెస్టుల్లోనూ అతడు ఏమంత మెరుగైన బ్యాట్స్‌మన్ కాదు. ఈ రెండు కోణాల్లో ఆలోచించే బీసీసీఐ అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చిందని తెలుస్తోంది.
ఫామ్‌లో ఉన్నా..
పృథ్వీషా గతేడాది న్యూజిలాండ్, ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో 0, 4 పరుగులు చేసిన అతడు తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయాడు. అనంతరం భారత్‌కు తిరిగొచ్చాక ఎక్కడ విఫలమవుతున్నాననే విషయంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రె వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు. ఆ సమయంలో కాలి కదలికలను, బ్యాటింగ్ చేసే టైమింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. దాంతో ఐపీఎల్‌కు ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రెచ్చిపోయాడు. ఒకే సీజన్‌లో 800పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అలా తన సమస్యను అధిగమించిన పృథ్వీ ఇటీవల ఐపీఎల్‌లోనూ చెలరేగిపోయాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న అతడు బరువు ఎక్కువ ఉన్నందునే సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని వినిపిస్తోంది.
గాయాలే భువి పాలిట శాపం..
ఇక భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం గాయాలనే చెప్పొచ్చు. 2018 జనవరిలో చివరిసారి దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడిన అతడు తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్‌లో ఆడలేదు. దాంతో టెస్టు క్రికెట్ ఆడక ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచాయి. అప్పుడతడు గాయం బారిన పడి చాలా కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆడి మళ్లీ గాయపడ్డాడు. అప్పుడు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఐదు టీ20ల్లో నాలుగు వికెట్లు, మూడు వన్డేల్లో ఆరు వికెట్లు తీశాడు. అయితే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 9.10 ఎకానమీతో మూడు వికెట్లే తీశాడు. దాంతో భువి పూర్తిస్థాయిలో సిద్ధంగా లేడని బీసీసీఐ భావించినట్లు అనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఐసీసీ ఏ జట్టుకైనా ఎక్కువ మంది ఆటగాళ్లను ఎంపిక చేసే వీలు కల్పించింది. అయినా ఈ ముగ్గుర్నీ ఎంపిక చేయకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ