పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 373 పరుగుల భారీస్కోరు సాధించింది. ఇంగ్లండ్ సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బట్లర్ (110) శతకంతో చెలరేగాడు. 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి పాకిస్థాన్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్ (87), బెయిర్ స్టో (51), మోర్గాన్ (71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, సోహైల్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టోలు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం మోర్గాన్ అర్ధశతకంతో ఆకట్టుకోగా... రూట్ 40 పరుగులతో మెరిశాడు.
బట్లర్ వీర బాదుడు..
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 55 బంతుల్లోనే 110 పరుగులు చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆద్యంతం పాక్ బౌలర్లను ఇబ్బంది పెడుతూ కెరీర్లో ఏడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
374 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది పాకిస్థాన్. ఒపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (35) - ఫకార్ జోడి తొలి వికెట్‌కు 92 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఫకార్ జమాన్ 93 బంతుల్లో 111 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాకిస్థాన్ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 194 పరుగులతో ఉంది.