టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో షార్జా వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిచెల్ (27; 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కాన్వే (27; 24 బంతుల్లో 3 ఫోర్లు), కేన్ విలియమ్సన్ (25; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) తలో చేయివేయడం వల్ల పాక్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కి ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (17 ), మిచెల్ శుభారంభం అందించారు. దీంతో కివీస్ ఐదు ఓవర్లకు 36/0తో నిలిచింది. రవూఫ్ వేసిన ఆరో ఓవర్‌లో గప్తిల్ ఔటయ్యాడు. ఇమాద్ వసీమ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మిచెల్, తర్వాతి ఓవర్‌లో నీషమ్ (1) పెవిలియన్‌కి చేరారు. తర్వాత వచ్చిన కాన్వే (24) ధాటిగా ఆడాడు. హాఫీజ్ వేసిన 12 ఓవర్లో విలియమ్సన్ వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. షాదాబ్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో కాన్వే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. రవూఫ్ వేసిన18 ఓవర్‌లో కాన్వే, ఫిలిప్స్ (13) పెవిలియన్ చేరారు. తర్వాతి ఓవర్‌లో సీఫర్ట్ (8) కూడా ఔటయ్యాడు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి శాంటర్న్ (6) బౌల్డ్ అయ్యాడు. పాక్ బౌలర్లలో రవూఫ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. హాఫీజ్, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్ పడగొట్టారు.