Rashid latif on ipl media rights: రాబోయే ఐదేళ్లకు భారత టీ20 లీగ్ మీడియా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం పాక్ మాజీ క్రికెటర్లకు మింగుడుపడట్లేదేమో..! ఇటీవల జరిగిన ఈవేలంలో ఈ మెగా టీ20 టోర్నీ ప్రసార హక్కులకు సంబంధించి బీసీసీఐ ఖాజానాకు రూ.48,390 కోట్ల ఆదాయం లభించింది. దీంతో ఇది ప్రపంచ క్రీడా లీగుల్లోనే రెండో అతిపెద్ద ఈవెంట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
'భారత టీ20 లీగ్ మొత్తం వ్యాపారమే. ఇది సరైన పద్ధతి కాదు. ఇది నాణ్యమైన క్రికెట్ కానేకాదు. మీరు భారత క్రికెట్ అభిమానులను పిలిచి.. ఎన్ని గంటలు ఈ టీ20 లీగ్ మ్యాచ్‌లు చూస్తారని అడగండి. మీకే తెలుస్తుంది. దీనికి ఏ పేరైనా పెట్టండి. దానికి అంత విలువ ఉందని చెప్పినా.. ఇంకేం చెప్పినా.. అది పూర్తిగా వ్యాపారమే. ఎంత కాలం అది నిలబడుతుందో చూడాలి' అంటూ లతీఫ్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఇంతకుముందు షాహిద్ అఫ్రిది సైతం భారత టీ20 లీగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో క్రికెట్‌కు మంచి మార్కెట్ ఉందని, దీంతో ఆదాయం బాగుందని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ఏది చెబితే అది చెల్లుతుందంటూ భారత క్రికెట్‌పై నోరుపారేసుకున్నాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ జట్టుకు ఆడనున్న పంత్, బుమ్రా, పుజారా!