సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకుండానే జులైలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. లంకతో మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ధ్రువీకరించాడు.
అయితే, దేశవాళీ టోర్నీలతోపాటు ఐపీఎల్‌లో నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ నితీశ్ రానా ఈ పర్యటనకు ఎంపిక అవుతాననే ఆశాభావంతో ఉన్నాడు. జాతీయ జట్టులో స్థానం దక్కిందని సెలక్షన్ కమిటీ నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నాడు.
"ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో నాకు స్థానం దక్కుతుందని నా అంతరాత్మ చెబుతోంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీరు మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా రికార్డులను పరిశీలించండి. అది దేశవాళీ టోర్నీఐనా, ఐపీఎల్‌ఐనా నేను మంచి ప్రదర్శన కనబరిచా. దానికి ప్రతిఫలం నేడో, రేపో దక్కుతుందని భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ పిలుపునకు ఒక్క అడుగు దూరంలో ఉన్నానని అంటున్నారు. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా" అని నితీశ్ రానా అన్నాడు.