ఐపీఎల్ రాకతో ప్రపంచ క్రికెట్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పవర్ ప్లే, ఫీల్డింగ్ మార్పులు, డీఆర్‌ఎస్, ఫ్రీ హిట్.. ఇలా ఎన్నో మార్పులను చూశాం. ఇకపోతే తాజా సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్‌కు రివ్యూ తీసుకునే అవకాశం.. వంటి కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త రూల్‌ను తీసుకురానున్నారు.
అదేంటంటే.. కెప్టెన్లు.. తమ తుది జట్టు, ఇంపాక్ట్ ప్లేయర్స్ వివరాలను టాస్ తర్వాతే ప్రకటించేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో టాస్ గెలుపోటముల ఆధారంగా కెప్టెన్లు తమ.. అత్యుత్తమ జట్టును బరిలోకి దించే అవకాశముంటుంది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకునే విషయంలోనూ ఈ నయా రూల్ బాగా ఉపయోగపడుతుంది.
ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓ టీమ్‌ను, అదే బౌలింగ్ చేయాల్సి వస్తే ఇంకొక జట్టును సెలెక్ట్ చేసుకుని ఛాన్స్ కెప్టెన్లకు, ఫ్రాంచైజీలకు దక్కుతుంది. గత సీజన్ వరకు సారథులు.. టాస్‌కు ముందే తుది జట్ల వివరాలను తెలిపేవారు. దీని వల్ల.. టాస్ గెలిచినా, ఓడినా.. ముందుగానే అనుకున్న జట్టును మార్పులు లేకుండా బరిలోకి దింపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నయా రూల్‌తో ఆ బాధ తప్పింది. ఇకపోతే ఈ కొత్త నిబంధనను.. గతంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అమలు చేశారు.
ఇంకా ఈ ఐపీఎల్ సీజన్‌లో మరిన్ని కొత్త నిబంధనలను కూడా అమలు చేయనున్నారు. అవేంటంటే.. నిర్దిష్ట సమయంలో బౌలర్ తన ఓవర్ పూర్తి చేయకపోతే ఓవర్ రేట్ పెనాల్టీ ఉండనుంది. ఓవర్ రేట్ పెనాల్టీ విధిస్తే కనుక 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్‌లు మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఫీల్డర్ లేదా వికెట్ కీపర్.. తమ స్థానాల్లో నిలబడకుండా.. అటు ఇటూ కదులుతూ కనిపిస్తే ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించడంతో పాటు ప్రత్యర్థి జట్టుకు ఐదు పెనాల్టీ రన్స్ ఇస్తారు. ఇకపోతే మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్- డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ మొదలు కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 70 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సారి ట్రోఫీని ఏ జట్టు ముద్దాడనుందో.
ఇదీ చూడండి: వికెట్ల మధ్య ఫాస్టెస్ట్ అండ్ వరస్ట్ రన్నర్ ఎవరు?.. కోహ్లీ ఆన్సర్ ఇదే