MSK Prasad on Rahane: టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు విదేశాల్లో మెరుగైన రికార్డు ఉందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అందుకే త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో అతడికి ఉన్న అనుభవం జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు.
"విదేశీ పిచ్‌లపై రహానే మెరుగ్గా రాణించగలడు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిని దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. ప్రస్తుతం రహానె ఫామ్‌పై కొంత ఆందోళన నెలకొన్నా.. విదేశాల్లో అతడికున్న అనుభవం జట్టుకు కలిసొస్తుందన్న ఆలోచనతో బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలిచినట్లే.. యువ ఆటగాళ్లను కూడా బీసీసీఐ ప్రోత్సహిస్తుంది. జట్టులో అందరికీ సమప్రాధాన్యం ఇస్తుంది. అప్పుడే జట్టులో సమతూకం వస్తుంది"
-- ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలెక్టర్.
విదేశాల్లో రహానే 41.71 సగటుతో మూడు వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రత్యేకించి సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కోహ్లీ (3,551 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రహానే (2,646 పరుగులు) నిలిచాడు. అయితే, గత కొద్ది కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న రహానే.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన మరో అవకాశాన్ని అతడు ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి! దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి:
టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ ముందున్న కీలక సవాళ్లివే!