IPL 2023 Dhoni: టీమ్ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. ఇప్పటి నుంచే ఐపీఎల్ కోసం సన్నద్ధమవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది ఐపీఎల్‌లో ధోనీ చక్కగా రాణించాడు. వయసు పెరుగుతున్నా.. తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు.
ఇదే చివరి ఐపీఎల్?
ఆటగాడిగా ధోనీకి వచ్చే ఐపీఎల్ చివరిదని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్‌మెంట్ తీసుకుంటానని ధోనీ గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు తన చివరి మ్యాచ్ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ధోనీ ఉంటాడని, మెంటార్‌గానో లేక కోచ్‌గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం.
ధోనీ ఆడినా.. చెన్నై ఫెయిల్..
గతేడాది ధోనీ చక్కగా ఆడినప్పటికీ చెన్నై జట్టు పెద్దగా రాణించలేదు. ఆడిన మొత్తం 14 మ్యాచుల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో టోర్నీని ముగించింది. గత సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు పలికాడు. అతడి నుంచి రవీంద్ర జడేజాకు పగ్గాలు అందాయి. కానీ జడ్డూ కెప్టెన్‌గా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అనంతరం సీజన్ మధ్యలోనే అతను కూడా కెప్టెన్సీ వదులుకున్నాడు. దీంతో మళ్లీ ధోనీకే జట్టు పగ్గాలు అందాయి.
కెప్టెన్ డైలమా..
ఈసారి కూడా చెన్నై జట్టు సారధిగా ధోనీనే ముందుండి నడిపిస్తాడు. అతడి తర్వాత జట్టు పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో చెన్నై చాలా ఆలోచనలు చేస్తోంది. ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా కెప్టెన్‌గా తయారు చేయాలని చెన్నై యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ లెక్కన చూస్తే ధోనీకి ఒక ఆటగాడిగా ఇదే చివరి ఐపీఎల్ అనిపిస్తోంది. వచ్చే సీజన్ నుంచి అతడు కోచింగ్ బాధ్యతలే నిర్వర్తిస్తాడేమో మరి.