Mithali Raj: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మళ్లీ మైదానంలో చూస్తామా? ఇప్పుడీ ప్రశ్నే చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ కల సాకారం చేసుకోవడం కోసం ఆమెకు మిగిలిన చివరి అవకాశం కూడా వృథా అయిపోయింది. దీంతో త్వరలోనే ఈ హైదరాబాదీ క్రికెటర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మహిళల క్రికెట్లో మరొకరికి సాధ్యం కాని రీతిలో రికార్డు స్థాయిలో ఆరో వన్డే ప్రపంచకప్ ఆడిన ఆమెకు.. కప్పు కల మాత్రం నెరవేరలేదు. ఈసారి అనూహ్య పరాజయాలతో సెమీస్ కూడా చేరకుండానే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఆమె ముందుగానే చూచాయగా పేర్కొంది. కానీ ఇప్పుడు ఓటమి బాధలో భవిష్యత్ గురించి మాట్లాడటం సరికాదని తెలిపిన నేపథ్యంలో ఆమె మనసులో ఏముందో అనే ఆసక్తి కలుగుతోంది. ప్రతిదానికీ ఓ ముగింపు ఉంటుందని చెప్పిన ఆమె త్వరలోనే తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రపంచకప్ కోసమే: 39 ఏళ్లు.. ఇప్పుడు మిథాలీ వయసు. ఈ వన్డే ప్రపంచకప్ కోసమే ఆమె కెరీర్ పొడిగించుకుంటూ వచ్చిందనడంలో సందేహం లేదు. తన చిరకాల వాంఛను ఈసారైనా నెరవేర్చుకోవాలని ఆమె ఆశించి ఉండొచ్చు. కానీ తన సారథ్యంలో జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. ఇది అభిమానులతో పాటు మిథాలీకి తీవ్ర నిరాశ కలిగించే అంశం. 16 ఏళ్ల వయసులో 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆమె రెండు దశాబ్దాల కెరీర్‌ను ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న ఆమె కప్పు కోసం మాత్రం పోరాటం చేస్తూనే వచ్చింది. 2017లో అందినట్లే అంది చేజారింది. దీంతో ఈ వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించిన మిథాలీ.. దీని కోసమే కెరీర్‌ను కాపాడుకుంటూ వచ్చింది. మధ్యలో టీ20 జట్టులో చోటు దక్కకపోవడం వల్ల పొట్టి ఫార్మాట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలపైనే ధ్యాస పెట్టింది. ఇలా ఈ ప్రపంచకప్ కోసం అన్ని రకాలుగా సిద్ధమైన ఆమెకు చివరకు నిరాశ తప్పలేదు.
ఇక కష్టమే: ప్రస్తుత ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆమె తిరిగి మైదానంలో అడుగుపెడుతుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ టోర్నీ కోసం ఇన్ని రోజులు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఆమె కొనసాగింది. కానీ ఇప్పుడు కప్పు కథ ముగిసింది. దీంతో మిథాలీ ముందున్న మార్గం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇంకో ప్రపంచకప్ కోసం ఎదురు చూడడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తన ఫామ్ కూడా ఆశాజనకంగా లేదు. మరోవైపు యువ క్రికెటర్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ సమయంలో తిరిగి సత్తాచాటి ఆమె జట్టులో స్థానం కోసం బలంగా నిలబడడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సెలక్టర్లు ఇకపై ఆమెను పరిగణలోకి తీసుకుంటారా అన్నది కూడా ప్రశ్నగా మారింది. అందుకే మిథాలీతో పాటు మరో సీనియర్ జులన్ గోస్వామి ఇక ఆటకు వీడ్కోలు పలికి అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఇప్పటికే టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్‌కు లేదా స్మృతి మంధానకు వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. మరి మిథాలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: Mithali Raj: 'బాధగా ఉంది.. దానికిది సరైన సమయం కాదు'