తాను క్రికెట్ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. నల్లజాతి సహచరులను అవమానించేలా పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచిన బృందంలో భాగమైనందుకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు అతడు క్రికెట్ దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి 14 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించాడు.
బౌచర్‌పై ఆరోపణలు చేసిన వారిలో పాల్ ఆడమ్స్ కూడా ఉన్నాడు. అయితే ఆడమ్స్‌ను తాను అవమానకర మారు పేరుతో పిలవలేదని, మరింత సున్నితంగా వ్యవహరించాల్సిందని తన ప్రమాణ పత్రంలో బౌచర్ పేర్కొన్నాడు.
"నిజం లేదా నిజమని భావిస్తున్న నా అమర్యాదకర ప్రవర్తన పట్ల భేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్‌ఏ మరింత సున్నితంగా ఉండాల్సింది. జట్టు సభ్యులందరు ఇలాంటి సమస్యల స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది" అని చెప్పాడు. బౌచర్ దక్షిణాఫ్రికా తరఫున 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు.
ఇదీ చదవండి : కోహ్లీ సన్నిహితుడే కాబోయే ప్రధాన కోచ్!