Laxman Women Cricket Team: ఈ మధ్య కాలంలో పురుషుల క్రికెట్‌తో పాటు మహిళా క్రికెట్‌కు కూడా విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఉమెన్ వరల్డ్ కప్ 2022 టోర్నీ మ్యాచులను క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా వీక్షించారు. అయితే భారత మహిళా జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడి.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇక, అమ్మాయిల ఆటకు కూడా ఆదరణ పెరుగుతుండడం వల్ల భారత మహిళా జట్టును పటిష్ఠంగా మార్చేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. గత ఏడాది భారత మహిళా టీమ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్.. కాంట్రాక్ట్ గడువు ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ టోర్నీతోనే ముగిసింది.
ఇక, బీసీసీఐ రూల్స్ ప్రకారం రమేశ్ పొవార్ మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బీసీసీఐ మాత్రం పవార్ కాంట్రాక్ట్ గడువును పొడగించేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దీంతో మహిళా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పదవిని అప్లికేషన్స్, ఇంటర్వ్యూలతో భర్తీ చేయబోతున్నారు. కావాలంటే పొవార్ మరోసారి ఈ పదవికి అప్లై చేసి, క్రికెట్ అడ్వైసరీ కమిటీ ముందు ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. భారత మహిళా జట్టుకు అవసరమైన మెరుగులు దిద్దేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో గతంలో భారత అండర్ 19 జట్టు.. ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో గెలిచింది. దీంతో ఇప్పుడు లక్ష్మణ్ ఫోకస్ భారత మహిళా జట్టుపై పడిందని సమాచారం. మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామిలు తమ రిటైర్మెంట్లకు దగ్గర్లో ఉన్నారు. అందుకే భారత పురుషుల జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సంప్రదింపులు చేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్, మహిళా జట్టును పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'కోహ్లీ.. ఆ ఒక్క షాట్ స్వేచ్ఛగా ఆడు'