KL Rahul Ravisastri: ఐపీఎల్-15లో భాగంగా గత రాత్రి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో లక్ష్యఛేదన సమయంలో నెమ్మదిగా ఆడిన రాహుల్సేనపై టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. లఖ్‌నవూ జట్టు ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అన్నాడు. ముఖ్యంగా ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ ఆటతీరును విమర్శించాడు. అతడు ఇంకాస్త ముందుగానే విజృంభించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
"లఖ్‌నవూ జట్టు బ్యాటర్లు ఇంకాస్త ముందుగా ధాటిగా ఆడితే బాగుండేది. టీ20ల్లో కొన్నిసార్లు చివరిదాకా ఉండే ప్రయత్నం చేయాలి. అందులో తప్పులేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అయితే అలా చేయడం కుదరదు. 9వ ఓవర్ నుంచి 14వ ఓవర్ దాకా మరీ నెమ్మదిగా ఆడారు. కీలక భాగస్వామ్యం (దీపక్ హుడా-కెఎల్ రాహుల్) కొనసాగుతున్న తరుణంలో ఒకరు ధాటిగా ఆడితే మరొకరు నెమ్మదిగా ఆడినా సరిపోతుంది. హుడా నెమ్మదించిన క్రమంలో రాహుల్ ధాటిగా ఆడాల్సింది. అతడు లీడ్ తీసుకుని హిట్టింగ్ చేస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. 9-13 ఓవర్ మధ్య అతడు హిట్టింగ్‌కు దిగితే లఖ్‌నవూ ఛేదన ఈజీ అయ్యేది. అప్పుడు ఆర్సీబీ కూడా కాస్త ఒత్తిడికి గురయ్యేది.. కానీ అలా చేయలేదు."
- రవిశాస్త్రి, టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లో 79 పరుగులు చేశాడు రాహుల్. పవర్‌ప్లేలో కొంచెం ధాటిగానే ఆడినట్టు కనిపించినా మిడిల్ ఓవర్స్‌లో నెమ్మదించాడు. 7 వ ఓవర్ నుంచి 13వ ఓవర్ వరకు అతడు ఒక్కటే ఫోర్ కొట్టడం గమనార్హం. ఫలితంగా ఈ మ్యాచ్లో 208 పరుగుల ఛేదనలో లఖ్‌నవూ..193 పరుగులకే పరిమితమైంది. దీపక్ హుడా (26 బంతుల్లో 45.. 1 ఫోర్, 4 సిక్సర్లు) కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. రాహుల్‌తో కలిసి హుడా.. నాలుగో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. మిడిల్ ఓవర్స్‌లో మరీ నెమ్మదిగా ఆడటం.. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్ల రాహుల్ సేనకు ఓటమి తప్పలేదు.
ఇవీ చదవండి: ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు