తెలుగు తేజం, ముంబయి ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ 2022 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టాడు. అరంగేట్ర సీజన్‌లోనే ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో స్థానం సంపాదించాడు. తొలి సీజన్‌ను అద్భుతంగా ముగించి హైదరాబాద్ చేరుకున్న తిలక్ తన అనుభవాన్ని 'ఈనాడు- ఈటీవీ భారత్'తో పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే ఇలా..
ఆల్‌రౌండర్‌గా..: తొలి సీజన్‌లోనే ముంబయిపై ముద్ర వేస్తానని ఊహించలేదు. అసలు అవకాశం లభిస్తుందని కూడా అనుకోలేదు. అలాంటిది 14 మ్యాచ్‌లు ఆడటం.. రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం బాధించింది. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేశా. అందరి సలహాలు, సూచనలను మైదానంలో ఆచరణలో పెట్టా. నా బ్యాటింగ్ గురించి అందరూ సానుకూలంగా మాట్లాడుతుంటే సంతోషంగా అనిపిస్తోంది. తిలక్ టీమ్‌ఇండియాకు ఆడతాడంటూ కెప్టెన్ రోహిత్‌శర్మ, దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతిసారి ఈ మాటల్ని గుర్తుచేసుకునేవాడిని. వచ్చే ఏడాది నా బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. నన్ను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా చూడాలన్నారు. ఆఫ్ స్పిన్నర్‌గా 4 ఓవర్లు వేయిస్తామని చెప్పారు. అప్పుడు అదనంగా మరో బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందని తెలిపారు. టీమ్‌ఇండియా లక్ష్యంగా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మారతా.
దిగ్గజాల పాఠాలు..: సచిన్ తెందుల్కర్, మహేళ జయవర్దనె, జహీర్‌ఖాన్, రోహిత్‌శర్మ.. వీళ్లను టీవీల్లో చూడటమే కానీ ఎప్పుడూ కలవలేదు. వీళ్లందరిని హోటల్‌లో మొదటిసారి చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేరుగా వెళ్లి మాట్లాడేందుకు ధైర్యం సరిపోలేదు. జట్టు సమావేశంలో అందరూ పాల్గొన్నారు. అప్పుడు అందరూ నాతో మాట్లాడారు. దీంతో భయం పోయింది. మైదానంలోనూ వాళ్లంతా అండగా నిలిచారు. ఏ మైదానంలో.. ఏ బౌలర్‌ను ఎలా ఆడాలో నేర్పించారు. సచిన్, జయవర్దనె, జహీర్‌లు నా ఆటకు మరిన్ని మెరుగులు దిద్దారు. ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించడమెలాగో నేర్పారు.
కెప్టెన్ కామెంట్స్..:
ముంబయి శిబిరంలోకి వెళ్లిన తర్వాతి రోజు ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేశా. కొద్దిసేపు నా బ్యాటింగ్‌ను చూసిన రోహిత్ ఎంతగానో ఫిదా అయిపోయాడు. రెండో రోజు సెషన్‌లోనూ నన్ను పరిశీలించాడు. వెంటనే నా దగ్గరికి వచ్చి 'నీలో చాలా ప్రతిభ ఉంది. తక్కువ వయసులోనే బాగా ఆడుతున్నావు. టీమ్‌ఇండియాకు కచ్చితంగా ఆడగలవు. ఏకాగ్రత కోల్పోకుండా ఆడు. ఏ దశలోనూ ఒత్తిడి పెంచుకోకు. ప్రతి సందర్భాన్ని ఆస్వాదించు. వర్తమానంలోనే ఉండు. ఆటపైనే దృష్టిసారించు' అని అన్నాడు. రోహిత్ మాటలతో స్ఫూర్తి పొందాను. చివరి మ్యాచ్ వరకు ఆత్మవిశ్వాసంతో ఆడా.
అందరూ అండగా..: అండర్-19 ప్రపంచకప్‌కు ఆడిన అనుభవం నాకు కలిసొచ్చింది. అక్కడ ఇంతమంది ప్రేక్షకులు లేకపోయినా దేశానికి ఆడుతున్నామన్న ఒత్తిడి ఉండేది. ఐపీఎల్‌లోనూ అలాంటి పరిస్థితులే కనిపించాయి. కానీ కెప్టెన్ రోహిత్, సచిన్ సర్‌తో సహా ముంబయి మేనేజ్‌మెంట్ మొత్తం అండగా ఉండటంతో ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. 14 మ్యాచ్‌ల్లో వన్‌డౌన్, టూ డౌన్, త్రీ డౌన్‌లో ఆడా. ఏ స్థానంలో బరిలో దిగినా సమర్థంగా బ్యాటింగ్ చేశా. తక్కువ ఓవర్లు ఉన్నప్పుడు షాట్లు ఆడటం.. తొందరగా వికెట్లు పడితే చివరి వరకు క్రీజులో ఉండి ఫినిషర్ పాత్ర పోషించడాన్ని ఆచరణలో పెట్టా.
ఇదీ చదవండి: Women's T20 Challenge: చెలరేగిన పూజ.. మంధాన సేన చిత్తు