ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిన మనీశ్ పాండే.. నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. టీమ్ఇండియాలో చోటు నిలుపుకోలేకపోవడానికి ఇదీ ఓ కారణమేనని మాజీ క్రికెటర్ నెహ్రా అన్నాడు. అతడికి తుదిజట్టులో చోటు దక్కడం త్వరలో కష్టమవుతుందని మాజీ ఆటగాడు అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.
బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 పరుగుల మాత్రమే చేసిన మనీష్ పాండే.. హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
"పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మనీశ్ పాండే చాలా రోజుల కిందటే అరంగేట్రం చేశాడు. కానీ పరిస్థితులను అంచనా వేస్తూ అందుకు తగిన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. పాండే తర్వాత అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంలో అతని కంటే ముందున్నారు. వారి ఆటతీరు కూడా భిన్నంగా ఉంది. ఈ కారణం వల్లే పాండే టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు" అని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు.
"సన్‌రైజర్స్ పునరాలోచన చేస్తుందని అనుకుంటున్నా. జట్టులో విలియమ్సన్ పాత్ర చాలా ముఖ్యమైందని మేం మొదటి నుంచి చెప్తున్నాం. తక్కువ స్కోర్‌లు నమోదైన మ్యాచ్‌లో అతని విలువ రెట్టింపవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ మంచి ఫినిషింగ్ బ్యాట్స్‌మెన్ వైపు చూస్తోంది. రాబోయే మ్యాచ్‌లలో మనీశ్ పాండేకు తుదిజట్టులో స్థానం ఉండదు. ఈ విషయంలో నాకైతే ఎలాంటి అనుమానం లేదు. సన్‌రైజర్స్ జట్టులో కొన్ని మార్పులు జరగటం మీరే చూస్తారు. ఇదంతా సహజమైనదే" అని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు.