ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో కరోనా కేసులు నమోదైనా లీగ్ ఇప్పటివరకు సుజావుగానే సాగింది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరగడం క్రికెట్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు పాజిటివ్ తేలడం వల్ల.. ఆ జట్టుకు, ఆర్సీబీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అంతలోనే సీఎస్కేలో ముగ్గురు, ఐదుగురు దిల్లీ మైదాన సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. దీంతో తదుపరి మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
అయితే దీనిపై స్పంధించిన ఆయా ఫ్రాంచైజీలకు చెందిన పలువురు అధికారులు.. కరోనా ఉద్ధృతి పెరిగినా లీగ్ కొనసాగించాల్సిందేనని అన్నారు. యథావిధిగా మ్యాచులు జరపాల్సిందేనని తెగేసి చెప్పారు. అవసరమైతే మరింత కఠిన జాగ్రత్త చర్యల నడుమ ఆడతామని స్పష్టం చేశారు.
"వెనక్కి తగ్గే సమస్యే లేదు. ఇప్పటికే సగం టోర్నీ పూర్తైంది. కొత్తగా కరోనా కేసులు నమోదవ్వడం(కేకేఆర్‌లో) బీసీసీఐకి ఓ పెద్ద సవాలు. మరి ఈ సమస్యను బోర్డు ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఓ ఆటగాడికి గాయం అవ్వడం వల్ల స్కాన్ చేయించడానికి బయోబబుల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అక్కడే అతడికి వైరస్ సోకి ఉండవచ్చు. ప్రతిఒక్కరూ ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటిస్తన్నారు."
-ఓ ఫ్రాంచైజీ అధికారి.
"ఒకవేళ లీగ్‌ను వాయిదా వేయాలనుకున్నా ఎంతకాలం వేస్తారు? పాజిటివ్ కేసులను ఐసోలేషన్లోకి పంపిస్తూ మిగతా వారిచేత ఆడించటమే."
-మరో ఫ్రాంచైజీ అధికారి.
"ఏది చేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని బీసీసీఐ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి."
-మరో ఫ్రాంచైజీ అధికారి.
"కరోనా కేసులు నమోదయ్యాయి అని తెలియగానే మా ఆటగాళ్లను గదుల్లో నుంచి బయటకు రాకుండా కచ్చితంగా ప్రొటోకాల్స్ పాటించాలని సూచించాం. వారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయినా ఈ పరిస్థితుల్లో బయోబబుల్‌లో ఉండటమే వారికి అత్యంత సురక్షితం."
-మరో ఫ్రాంచైజీ అధికారి
ఇతర ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు కూడా లీగ్ కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారు.
ఇదీ చూడండి: ఐపీఎల్: చెన్నై సూపర్‌కింగ్స్‌లో ముగ్గురికి కరోనా!