ఐపీఎల్ 14 సీజన్‌లో మ్యాచ్‌లు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌ల ఫలితం చివరి బంతి వరకూ తేలడం లేదు. అయితే, కొంతమంది బ్యాట్స్‌మెన్ బౌలర్లపై ఇసుమంతైనా కనికరం చూపడం లేదు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలకు పంపుతూ పరుగుల వరద పారిస్తున్నారు. కొందరు ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో ఏకంగా 30కి పైగా పరుగులు రాబడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఒక ఓవర్‌లో అత్యధికంగా ఎన్ని పరుగులు చేశాడో ఓ లుక్కేద్దాం.
జడేజా సిక్సర్ల వర్షం..
![The batsmen who have scored the most runs in a single over in this IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11610821_jadeja-in_720.jpg)
ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేసి క్రిస్‌గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జడ్డూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సిక్స్‌లు బాదాడు. మరో ఫోర్‌తో పాటు రెండు పరుగులు కూడా చేశాడు. కాగా.. ఇందులో మూడో బంతి నో బాల్. ఈ ఓవర్‌లో మొత్తం 37 పరుగులు వచ్చాయి.
కమిన్స్ మెరుపులు..
ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు చేశాడు. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన కమిన్స్.. తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి.. చివరి బంతిని మళ్లీ స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో ఈ ఓవర్‌లో కమిన్స్ 30 పరుగులు రాబట్టాడు.
పృథ్వీ 'షో'..
![The batsmen who have scored the most runs in a single over in this IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11610821_shaw-in_1.jpg)
ఏప్రిల్ 29న దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన పోరులో దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించాడు. ఒకే ఓవర్‌లో 24 పరుగులు రాబట్టాడు. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే షా ఏకంగా 6 బంతుల్లో ఆరు బౌండరీలు బాది రికార్డు సృష్టించాడు. ఈ ఓవర్ తొలి బంతిని మావి వైడ్‌గా వేశాడు. దీంతో మొత్తం ఆ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి.
ఇదీ చదవండి: అడ్డంకులున్నా ఆగని ఒలింపిక్ జ్యోతియాత్ర
డివిలియర్స్ అదుర్స్..
![The batsmen who have scored the most runs in a single over in this IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11610821_ab-in_1.jpg)
ఏప్రిల్ 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఒకే ఓవర్‌లో 22 పరుగులు రాబట్టాడు. స్టోయినిస్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన ఏబీ.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాత నాలుగు, ఐదు బంతులను కూడా స్టాండ్స్‌లోకి పంపి.. చివరి బంతికి రెండు పరుగులు చేశాడు.
రసెల్ జిగేల్..
![The batsmen who have scored the most runs in a single over in this IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11610821_russel-in_1.jpg)
ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రసెల్ 22 పరుగులు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో తొలి బంతికి సిక్స్ కొట్టిన రసెల్.. రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతిని సిక్సర్‌గా మలిచిన విండీస్ వీరుడు.. చివరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: లివింగ్‌స్టోన్ స్థానంలో గెరాల్డ్ కోజీ