దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోని మొదటి 20 మ్యాచ్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విజయవంతంగా నిర్వహించింది. ఈ టోర్నీ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు టీమ్ఇండియాకు ఎంపికై రాణిస్తున్నారు. అయితే.. ఐపీఎల్‌తో స్టార్లుగా ఎదిగిన కొందరు మాత్రం.. ప్రస్తుత సీజన్లో రాణించడానికి కష్టపడుతున్నారు. గతంలోని ప్రదర్శనతో పోలిస్తే ప్రస్తుతం ఆ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల క్రికెట్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ టోర్నీ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకొని.. ప్రస్తుతం రాణించలేకపోతున్న ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.
హార్దిక్ పాండ్యా..
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ముంబయి ఇండియన్స్ దారుణంగా విఫలమవుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటివరకు ఒక్కసారీ 160పైచిలుకు పరుగులు సాధించలేకపోయింది. దీనికి కారణం.. మిడిల్ ఆర్డర్‌లోని ఆల్‌రౌండర్లు రాణించకపోవడమే! గతంలో ముంబయి జట్టులో.. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలకంగా వ్యవహరించిన ఆటగాడు హార్దిక్ పాండ్యా.
![Team India capped players who have been struggling in IPL 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/hardik_0704newsroom_1617790584_517.jpg)
యూఏఈ వేదికగా గతేడాది జరిగిన సీజన్లోనూ అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు. కానీ, ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఐపీఎల్లో ముంబయి ఆడిన 5 మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా చేసిన పరుగులు వరుసగా 13, 15, 7, 0, 1. పాండ్యా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ముంబయి ఆశాభావంతో ఉన్నప్పటికీ.. టీ20 వరల్డ్‌కప్ ముందు అతడి ప్రదర్శన ఆందోళన రేకెత్తించేదే.
యుజ్వేంద్ర చాహల్..
ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లో.. టీమ్ఇండియా తుదిజట్టులో స్థానాన్ని కోల్పోయాడు ఒకప్పటి రెగ్యులర్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ అతడి ప్రదర్శన అనుకున్నంతగా లేదు.
![Team India capped players who have been struggling in IPL 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bc6dd048afb2f9c45cb9b024f94f8f10_1304a_1618310487_642.jpg)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన మొదటి మ్యాచ్‌తో పాటు కోల్‌కతా నైట్రైడర్స్పైనా పేలవప్రదర్శన చేశాడు. మరోవైపు రాజస్థాన్‌పై ఒక్క వికెట్టూ తీయలేదు. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు వికెట్‌ను సాధించాడు. అయితే ఈ సీజన్లో మాత్రం గుర్తింపు తగ్గ ప్రదర్శన చాహల్ నుంచి రాలేదు.
క్రునాల్ పాండ్యా..
హార్దిక్ మాదిరిగానే క్రునాల్ పాండ్యా కూడా ముంబయి ఇండియన్స్‌లో కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. అవకాశం దొరికనప్పుడల్లా అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు అండగా నిలిచాడు. ఇటీవల జాతీయ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు.
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో వరుసగా 7, 15, 3*, 1, 3 పరుగులతో సరిపెట్టుకోగా.. మూడు వికెట్లను మాత్రమే సాధించాడు. ముంబయి జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతోన్న పాండ్యాను తప్పించేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవచ్చు.
రవిచంద్రన్ అశ్విన్
కరోనా సంక్షోభం తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో తనదైన మార్క్‌తో గుర్తింపు పొందాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కానీ, ప్రస్తుత ఐపీఎల్లో విఫలమయ్యాడు. పరుగులు నియంత్రించినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక వికెట్ మాత్రమే సాధించగలిగాడు. కానీ, దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే 5 వికెట్లు తీయడం విశేషం.
అయితే.. తన కుటుంబం కరోనా బారిన పడిన కారణంగా ఐపీఎల్ నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు అశ్విన్.
![Team India capped players who have been struggling in IPL 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-ashwin_2604newsroom_1619401892_244.jpg)
ఇదీ చూడండి.. కరోనా భయాలు- ఐపీఎల్‌ను వీడుతున్న ఆసీస్ క్రికెటర్లు!