Suryakumar Yadav IPL 2023: మిస్టర్ 360గా పేరొంది అంతర్జాతీయ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ముంబయి ఇండియన్స్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచుల్లో పేలవ ప్రదర్శనను కనబరిచిన సూర్యకుమార్.. ఇప్పుడు మంచి ఫామ్‌తో మెరుస్తున్నాడు. క్రీజులో దిగితే బౌండరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ను టీమ్ఇండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య కుమార్‌ను గణితశాస్త్రజ్ఞుడు అంటూ కొనియాడాడు.
"స్కై(సూర్య కుమార్ యాదవ్) కేవలం ఒక బ్యాటర్ కాదు. అతడు గణిత శాస్త్రజ్ఞుడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనను తాను బ్యాలెన్స్ చేసుకునే విధానం అమోఘం. సూర్య ఒక మ్యాథ్స్ టీచర్‌లాగా గ్రౌండ్‌ను తనకు అనుకూలంగా విభజించుకొని.. సౌకర్యంగా ఆడతాడు. బౌలర్ పేస్‌ను చక్కగా ఉపయోగించుకుని కళ్లు చెదిరే సిక్సర్లు కొడతాడు. ఎక్కడ ఫీల్డర్ ఉన్నాడో.. ఎక్కడ గ్యాప్ ఉందో చూసి మరీ కచ్చితత్వంతో భారీ షాట్లు బాదుతాడు. సాధారణంగా ఆకాశమే హద్దు అంటారు. కానీ సూర్య కుమార్‌కు ఆకాశం కూడా పరిమితి కాదు. ముంబయి ఇండియన్స్ గెలుపు రుచి చూస్తే.. వారిని ఎవరూ ఆపలేరు' అంటూ పేర్కొన్నారు.
Surya Kumar Yadav Stats : ఇక ఈ ఐపీఎల్ సీజన్ మొదట్లో సూర్య తడబడినప్పటికీ మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు. నిలకడతో రాణిస్తూ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. ముంబయి గత రెండు మ్యాచ్‌ల్లో సక్సెస్‌ఫుల్‌గా 200+ టార్గెట్లను చేజ్ చేసింది. ఈ రెండింటిలోనూ సూర్య కమార్ది కీలక పాత్ర. బ్యాక్ టు బ్యాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. మరోవైపు ఇదే ఐపీఎల్ సీజన్లోనే సూర్య టీ20ల్లో 6000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతి తక్కువ బంతుల్లోనే(4017) ఈ ఫీట్ చేరుకున్న మొదటి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సూర్య తర్వాతి స్థానంలో సురేశ్ రైనా (4295 బంతుల్లో), కేఎల్ రాహుల్ (4342 బంతుల్లో) ఉన్నారు.
బౌలర్ ఎవరైనా గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదగల నైపుణ్యాలు సూర్య సొంతం. తన వీరోచిత ఆట తీరుతో ముంబయి ఇండియన్స్‌కు ఎన్నో అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేశాడు. బంతి ఎలా వచ్చినా దాన్ని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా టెక్నిక్‌తో బాదుతాడు. ఆలస్యంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్య.. ఊహించని రీతిలో టీ20ల్లో ఇప్పటికే మూడు సెంచరీలు నమోదు చేసి వరల్డ్ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
Mumbai Indians Squad 2023 : "ముంబయి ఇండియన్స్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే వారి విజయాలకు తోడ్పడుతోంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టచ్‌లోకి రావటం ముంబయికి కసిసొచ్చే అంశం" అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నారు. కాగా ఐపీఎల్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ 200+ లక్ష్యాలను ఛేదించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ రికార్డు సృష్టించింది. మొదట రాజస్థాన్ పై 213, తర్వాత పంజాబ్ మీద 215 పరుగుల టార్గెట్లను చేజ్ చేసింది.