Shubman Gill IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ సమరానికి ఇంకా గంటల సమయమే ఉంది. అయితే, ఇప్పుడు చర్చంతా రెండో క్వాలిఫయర్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పైనే. మూడు సెంచరీలు కొట్టిన వీరుడు ఫైనల్లో ఎంలాంటి మాయ చేస్తాడనే చర్చ నెట్టింట్లో మొదలైంది. అయితే, శుక్రవారం ఇంతటి మెపురు ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమ్ఇండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఈ యువ సంచలనంపై ప్రశంసల జల్లు కురిపించారు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా గిల్‌ను కొనియాడాడు. ఇన్‌స్టాలో అతడి ఫొటోలు పోస్టు చేసి స్టార్ సింబల్‌ను పెట్టారు. ఇక మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా గిల్‌ను ఆకాశానికెత్తేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. అందులో 'మరో అద్భుతమైన బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో క్లాస్ క్రికెట్‌ను రీడిఫైన్ (పునర్నిర్వచించండం) చేశాడు. గిల్ సాబ్ బాగా ఆడావు' అని రాసుకొచ్చాడు. 'ఏం ఆటగాడు. 4 మ్యాచ్‌ల్లో 3వ సెంచరీలు, కొన్ని ఉత్కంఠభరితమైన షాట్‌లు. అద్భుతమైన స్థిరత్వం, పరుగులపై ఆకలి. ఇదంతా సీనియర్ ఆటగాళ్లు చేసే అంశాలు. ఈ అద్భుతమైన ప్లేయర్‌ను క్యాష్ చేసుకోండి' అంటూ మాజీ హిట్టర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
గిల్ అన్‌స్టాపబుల్ సెంచరీ..
Shubman Gill Century : శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ ఇరగదీశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 సెంచరీలతో దుమ్మురేపాడు. ఇలా ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 260 రోజులు) నిలిచాడు. ఇక నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో బట్లర్ (2022 సీజన్), విరాట్ కోహ్లీ (2016)లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. ఆందోళనలో ఫ్యాన్స్..
IPL Orange Cap 2023 : గిల్ మూడు శతకాలు బాదడం బాగానే ఉంది. కానీ గిల్‌కు ఆరెంజ్ క్యాప్ రావడమే గుజరాత్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్లు ఉన్న జట్లు రెండు సార్లు మాత్రమే టైటిల్ గెలిచాయి. మిగతా సార్లు ఆరెంజ్ క్యాప్ హీరోల టీమ్‌లు కప్పు కొట్టలేదు. 2014లో రాబిన్ ఊతప్ప జట్టు కోల్‌కతా గెలిచింది. 2021లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఆరెంజ్ క్యాప్‌తో సాధించి ఆ టీమ్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.