Rohit Sharma: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టీ20 లీగ్‌లో ఎవరూ కోరుకోని రికార్డులో భాగమయ్యాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా నిలిచాడు. గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ ఔటయ్యాడు. ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో షాట్ ఆడి మిడాన్‌లో శాంట్నర్ చేతికి చిక్కాడు. దీంతో ఈ టోర్నీలో మొత్తంగా 14 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
ఈ జాబితాలో రహానె, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, మన్‌దీప్, హర్భజన్ సింగ్, పీయుష్ చావ్లా 13 సార్లు డకౌటయ్యారు. దీంతో వీరికన్నా రోహిత్ ఎక్కువసార్లు డకౌటై అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు తొలి ఓవర్‌లోనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) సైతం డకౌటయ్యాడు. దీంతో ముంబయి తరఫున ఓపెనర్లిద్దరూ ఇలా పరుగులు చేయకుండా ఔటవ్వడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2009లో జేపీ డుమిని, లూక్ రాంచీ ఆ జట్టు తరఫున ఇలాగే డకౌటైన ఓపెనింగ్ పెయిర్‌గా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో మరికొన్ని విశేషాలు
- ఛేదనల్లో అత్యధికంగా 8 సార్లు చివరి బంతికి గెలిచిన జట్టు చెన్నై. ఈ జాబితాలో ముంబయి 6, రాజస్థాన్ 4, పంజాబ్, బెంగళూరు చెరో 3 సార్లు విజయం సాధించాయి.
- ఈ లీగ్‌లో వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓటమిపాలైన తొలి జట్టుగా ముంబయి రికార్డు. 2013లో దిల్లీ, 2019లో బెంగళూరు తొలి ఆరు మ్యాచ్‌లు ఓటమిపాలయ్యాయి.
- ఈ లీగ్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇది 11వ సారి. అయితే గతంలో టైటిల్ సాధించిన జట్టు ఈ అవమానాన్ని మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే ముంబయి అత్యంత చెత్త రికార్డు